2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఇవాళ ఉభయసభల ముందుకు రానుంది. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం లక్షా నలభై ఆరు వేల కోట్ల అంచనాతో బడ్జెట్ను ప్రవేశ పెట్టింది. అయితే అందులో పది వేల కోట్లు భూముల అమ్మకం ద్వారా సమీకరించుకుంటామని చెప్పినా.. అది సాధ్యం కాలేదు. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సొంత పన్నుల రాబడి ఆశించిన మేర లేదు. జీఎస్టీ వసూళ్లు కూడా అంచనాలకు అనుగుణంగా లేవు. రవాణా, స్టాంపులు- రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ ఆదాయం బాగానే ఉంది. జీఎస్టీ వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉన్నందున కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కూడా తగ్గుదల ఉంది. రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధిరేటు మొత్తంగా 10 శాతం వరకు ఉంటుందన్నది ప్రభుత్వం అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం లోనూ పెద్దగా మార్పు ఉంటుందన్న అంచనాలు లేవు.
మరో 6 నెలల పాటు ఆర్థిక మాంద్యం..!
ఆర్థిక మాంద్యం ప్రభావం కనీసం మరో ఆరు నెలల పాటు ఉంటుందని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం 2020 - 21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఇవాళ ప్రవేశపెడుతోంది. ఈ పరిస్థితుల్లో పద్దు ఏమేరకు ఉంటుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. ఆర్థికమాంద్యం కారణంగా బడ్జెట్ పరిమాణాన్ని తగ్గించిన ప్రభుత్వం ఈసారి కూడా వాస్తవిక బడ్జెట్ను ప్రవేశ పెడుతుందని అంటున్నారు. అదే జరిగితే 10 శాతం వృద్ధి రేటు అంచనాతో బడ్జెట్ ఉండవచ్చని భావిస్తున్నారు. దీంతో పద్దు లక్షా యాబై ఐదు వేల కోట్ల మార్కుకు అటుఇటుగా ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
రాబడులు పెంచుకునే మార్గాలపై దృష్టి:
బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పన సమయంలోనే రాష్ట్ర స్వీయ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపైనా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. లీకేజీలు అరికట్టి వందశాతం వసూళ్లు, సంస్కరణల అమలు, పన్నుల పెంపు, భూముల మార్కెట్ విలువ పెంపు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు, క్రమబద్దీకరణ తదితరాలు ఇందులో ఉన్నాయి. భూముల అమ్మకం కూడా ఉంది. మొత్తమ్మీద 25 నుంచి 30 వేల కోట్ల వరకు రాబడులను పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటే బడ్జెట్ పరిమాణం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పద్దు ఆశ్చర్యకరంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు కొన్ని అంటున్నాయి.