Road accidents on Hyderabad Today News : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పరిధిలో బాహ్యవలయ రహదారిపై ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ పైనుంచి ఎగిరి అటుగా వస్తున్న బొలెరో, కారును ఢీకొంది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన నర్సింహగా గుర్తించారు. బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
టైల్స్ వ్యాన్ బోల్తా.. ఇద్దరు మృతి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు బాహ్య వలయ రహదారిపై ప్రమాదం జరిగింది. టైల్స్ లోడ్‌తో వెళ్తున్న మినీ డీసీఎం టైరు పేలటంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వట్టినాగులపల్లి నుంచి బొల్లారం పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మిస్తున్న పరిశ్రమకు గ్రానైట్ తీసుకెళ్తుండగా ముత్తంగి కూడలికి కొద్ది దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బిహార్‌కు చెందిన అనిల్ సదా, దర్పేందర్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందారు. రవీందర్, రాంబాలక్ స్వామి అనే మరో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం పటాన్ చెరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.