నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ నేడే ప్రారంభం హైదర్‌గూడలో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహ సముదాయాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో వీటిని నిర్మించారు. ఇందులో మొత్తం 12 అంతస్తుల్లో 120 త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు నిర్మించారు.
నిర్మాణానికి రూ.166 కోట్ల వ్యయం
మొత్తం 4 ఎకరాల 26 గుంటల విస్తీర్ణంలో వీటిని నిర్మించారు. వీటితో పాటు 36 స్టాఫ్ క్వార్టర్స్, 120 అటెండర్ క్వార్టర్స్‌ను ఇదే ప్రాంగణంలో నిర్మించారు. రూ. 166 కోట్లు వీటి నిర్మాణానికి ప్రభుత్వం వెచ్చిచ్చింది.
సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న క్వార్టర్స్
ఇక మూడు సెల్లార్స్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 12 అంతస్తుల్లో ఒకే భవనాన్ని నిర్మించారు. ప్రతి అంతస్తులో 10 ఫ్లాట్లు ఉన్నాయి. మూడు సెల్లార్స్ లో 276 కార్లను పార్కింగ్ చేసకునే అవకాశం ఉంది. విజిటర్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్స్‌లో 23 క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 8 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. అధునాతన హంగులతో నిర్మించిన ఈ క్వార్టర్స్‌లో నీటిని వృథా కాకుండా రీసైకిల్ చేసే విధానం కూడా ఉంది. శుద్ధి చేసిన నీటిని గార్డెన్‌లోని చెట్లను పెంచడానికి వినియోగిస్తారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం ప్రత్యేకంగా విద్యుత్ సబ్ స్టేషన్, 320 కేవీఏ గల డీజిల్ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: నేడు విజయవాడ వెళ్లనున్న సీఎం కేసీఆర్