రాష్ట్రపతి నిలయం సందర్శనకు నేడు చివరి రోజు సుందరమైన వనాలతో పాటు ఔషధ, పూల మొక్కలకు నెలవైన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి ప్రజల సందర్శన నేటితో ముగియనుంది. జనవరి 2 నుంచి ప్రాంగణంలోకి సందర్శకులను అధికారులు అనుమతించారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఇక్కడికి వస్తుంటారు. ఈసారి డిసెంబర్ 20 నుంచి 28 వరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇక్కడ బస చేశారు.
ఈసారి రెండు వారాలు..
రాష్ట్రపతి పర్యటన ముగిసిన నాటినుంచి బుధవారం వరకు మొత్తం 29వేల మందికి పైగా ఈ ప్రాంగణాన్ని సందర్శించారని అధికారులు తెలిపారు. గతేడాది వారం రోజుల పాటు మాత్రమే సందర్శకులను అనుమతించినా.. ఈ సారి రెండు వారాల పాటు రాష్ట్రపతి నిలయాన్ని సందర్శకులకు అందుబాటులో ఉంచారు.
పెరిగిన సందర్శకుల తాకిడి..
పండగ వేళ సెలవులు ఉన్నందున రాష్ట్రపతి నిలయానికి సందర్శకుల తాకిడి పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రాంగణంలో ఆహ్లాదంగా గడిపారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా రెండుసార్లు అనుమతించాలని సందర్శకులు కోరారు. ఈసారి రెండు వారాల వరకు సందర్శనకు అనుమతించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:'ముఖ్యమంత్రుల నిర్ణయానికి అనుగుణంగానే.. సమావేశం'