ఆర్థిక సంవత్సరం(2020-21) ఆస్తిపన్ను చెల్లించేందుకు గడువు బుధవారంతో ముగియనుంది. జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలను రాత్రి 12 గంటల వరకు నడిపించనున్నట్లు కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. మైజీహెచ్‌ఎంసీ మొబైల్ అప్లికేషన్, జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్, మీ సేవా కేంద్రాల ద్వారానూ పన్ను చెల్లించవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1,900 కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.1559.38 కోట్లు వసూలైంది.
ట్రేడ్ లైసెన్సుల పునరుద్ధరణకు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో వ్యాపారాలు నిర్వహించుకునేవారు ట్రేడ్ లైసెన్సులు తీసుకోవాలని బల్దియా కోరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 7,607 లైసెన్సులు జారీ అయినట్లు వెల్లడించింది. పాత లైసెన్సులను పునరుద్ధరించుకునే గడువు నేటితో ముగియనుందని, గురువారం నుంచి అపరాధ రుసుముతో రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు గుర్తుచేశారు. ఏప్రిల్ 1 నుంచి మే 30 మధ్య రెన్యువల్ చేస్తే 25 శాతం, మే 31 నుంచి పునరుద్ధరించేవారికి 50 శాతం అపరాధ రుసుము ఉంటుందని రెవెన్యూ విభాగం స్పష్టం చేసింది. లైసెన్సు లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ట్రేడ్ లైసెన్సు కోసం జీహెచ్‌ఎంసీ పౌరసేవా కేంద్రాలు, మీ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇదీ చూడండి:త్వరలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం!