ISB Hyderabad: అంతర్జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించేందుకు వార్టన్, బూత్, కెల్లాగ్, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వంటి విదేశీ విద్యా సంస్థలకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో.. అటువంటి ప్రమాణాలను మనదేశంలో ఆవిష్కరించిన ఘనత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు (ఐఎస్‌బీ) దక్కుతుంది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన ఈ విద్యా సంస్థ దినదిన ప్రవర్థమానమవుతూ, హైదరాబాద్‌కు ఎంతో ప్రతిష్ఠ తీసుకు రావడంతో పాటు దేశానికే గర్వకారణంగా ఎదిగింది.
తాజాగా ఎఫ్‌టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్- 2022లో ఐఎస్‌బీ 32వ స్థానాన్ని సంపాదించింది. ఆసియా- ఎఫ్‌టీ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్- 2022లో 4వ స్థానంలో నిలిచింది. మనదేశంలో రీసెర్చ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉంది. ప్రజలకు మేలు చేసే పలు సామాజిక పరిశోధనా ప్రాజెక్టులపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో; కొన్ని వర్తక సంఘాలతో కలిసి పనిచేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మేనేజ్‌మెంట్ విద్యావేత్తలు, పలు వ్యాపార సంస్థల ప్రతినిధులను ఆకర్షిస్తూ, స్థానికంగా వ్యాపార నైపుణ్యాల విస్తృతికి కృషి చేస్తోంది.
మనదేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు ఎన్నో ఏళ్లుగా ఉన్నత మేనేజ్‌మెంట్ విద్యను అందిస్తున్నాయి. కానీ అతి తక్కువ సమయంలో అత్యున్నత ప్రమాణాలను సాధించి, అంతర్జాతీయంగా మనదేశానికి గుర్తింపు తెచ్చిన ఘనత ఐఎస్‌బీకి దక్కుతుంది.
ఇంతటి కార్యాచరణతోనే:ఇంతటి అగ్రగామి సంస్థ మనదేశానికి రావడం, అదీ హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం అత్యంత అరుదైన అవకాశమనే చెప్పాలి. అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు దార్శనికతే ఇందుకు కారణం. మనదేశంలో అంతర్జాతీయ స్థాయి మేనేజ్‌మెంట్ విద్యా సంస్థను నెలకొల్పాలనే ఆలోచన మెకిన్సే అండ్ కంపెనీ చీఫ్ రజత్ గుప్తాది. రాహుల్ బజాజ్, ఆది గోద్రెజ్, అంబానీ.. వంటి కార్పొరేట్ అగ్రజులు రజత్ గుప్తా ఆలోచనను సమర్థించారు. 1997లో ఐఎస్‌బీ గవర్నింగ్ బోర్డు ఏర్పాటైంది.
ఈ విద్యాసంస్థను ఎక్కడ స్థాపించాలనే ప్రశ్న వచ్చినప్పుడు.. సహజంగానే దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబయి వైపు గవర్నింగ్ బోర్డు మొగ్గుచూపింది. కానీ మరిన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు రావడంతో, తుది నిర్ణయం తీసుకునే ముందు ఆయా రాష్ట్రాలలో పరిశీలించాలని బోర్డు భావించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు దీనికోసం పోటీ పడ్డాయి. ఇతర రాష్ట్రాలకు బోర్డు సభ్యులు వెళ్లినప్పుడు అక్కడి పాలకులు, అధికారులు కొంత తాత్సారం చేశారు. చంద్రబాబు మాత్రం చొరవ తీసుకుని, గవర్నింగ్ బోర్డు సభ్యులను స్వయంగా ఆహ్వానించి హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.
ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాలు వేగంగా విస్తరిస్తున్నందున ఐఎస్‌బీ వంటి అత్యున్నత స్థాయి మేనేజ్‌మెంట్ విద్యాసంస్థ ఏర్పాటైతే నగర ప్రతిష్ఠ ఇంకా పెరుగుతుందని ఆయన ఎంతో భావించారు. ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, వేగంగా అనుమతులు మంజూరు చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో గవర్నింగ్ బోర్డు హైదరాబాద్‌ను ఎంచుకుంది. 1999 డిసెంబరు 20న భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2001 డిసెంబరు 2న అప్పటి ప్రధాని వాజ్‌పేయీ చేతుల మీదుగా ఐఎస్‌బీ ప్రారంభమైంది.