నేడు సీఎల్పీ సమావేశం - today CLP meeting at gadhi bhavan
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్ భేటీ కానుంది. ప్రభుత్వాన్ని సభలో ఇరుకునపెట్టే విధంగా వ్యవహరించాలని హస్తం పార్టీ భావిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నేడు ఉదయం 9:30 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. పద్దులో లోటుపాట్లపై ప్రశ్నించేందుకు హస్తం పార్టీ సమాయత్తమవుతోంది. ఇవాళ ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు సోమవారం వరకు జరగనున్నాయి. సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎర్రజొన్న రైతుల గిట్టుబాటు ధరతోపాటు, ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. తెరాస ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వీలుగా బడ్జెట్ రూపకల్పన ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. కనీసం పది రోజులైనా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.