కరోనా విపత్కర సమయంలో ఆటో, ట్రాలీ డ్రైవర్ల జీవనం దుర్భరంగా మారిందని సీఐటీయూ నగర కమిటీ అధ్యక్షుడు ఈశ్వరయ్య విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గోల్కొండ క్రాస్ రోడ్లోని సీఐటీయూ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో ట్రాలీ డ్రైవర్ల సమస్యలపై పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన మండిపడ్డారు.
ఈఎంఐలు కట్టలేని దుస్థితి..
ఆటో, ట్రాలీ డ్రైవర్లకు ఉపాధి లేక వాహనాల ఈఎంఐ కట్టలేని దుస్థితి నెలకొందన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఆటో ట్రాలీ డ్రైవర్లను ఆదుకోవాలని కోరారు. ఆటో ట్రాలీ డ్రైవర్ల సమస్యలపై ఈనెల 22న ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
బియ్యం, సరుకులు అందించండి..
ఆటో ట్రాలీ డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఆటో ట్రాలీ డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు అజయ్ బాబు డిమాండ్ చేశారు. రవాణా రంగ కార్మికులకు కరోనా విపత్తు దృష్ట్యా ఒక్కొక్కరికి నెలకు 7500 రూపాయలతో పాటు పది కేజీల బియ్యం, నిత్యావసర సరుకులను అందచేయాలన్నారు. సెట్విన్ బస్సు సర్వీసులను కూడా పునరుద్ధరించాలని కోరారు.
అవి రద్దు చేయండి..
కొవిడ్ కాలంలో ట్రాఫిక్ పోలీసులు ఆటోలు, ట్రాలీలకు విధించిన జరిమానాలను పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటో ట్రాలీ డ్రైవర్ల సమస్యలపై ఈ నెల 22న తలపెట్టిన ఛలో ఇందిరా పార్క్ కార్యక్రమంలో భాగంగా 15న ఆర్టీవో కార్యాలయం ముందు ధర్నా, 20న ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి : ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివ బాలాజీ