కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ వ్యతిరేక విధానాలపై భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావాలని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరితే... దాన్ని రాష్ట్రాలపై రుద్దడం ఏ మాత్రం సమంజసం కాదని తెలిపారు. కేంద్రమే సీపీఎస్ రద్దు కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద గుదిబండగా మారిన ఆదాయ పన్ను పరిమితి.. రూ.10 లక్షల రూపాయలకు పెంచకపోయినట్లైతే... ఉద్యోగ వర్గం దాదాపు మూడు మాసాల వేతనం కోల్పోవాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజా ప్రాంగణంలో... రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటుగా మోదీ సర్కారు వైఖరిపై అంశాలను విస్తృతంగా చర్చించారు. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆపేయడంతోపాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు, కొవిడ్ వైరస్ బారినపడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు లాంటి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఏఐఎస్‌జీఈఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుభాశ్ లాంబ, ప్రధాన కార్యదర్శి శ్రీకుమార్ అధ్యక్షతన జరుగుతున్న జాతీయ సమావేశాల్లో 104 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, 29 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు.