TNGO and TGO leaders meet kcr : ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తారని టీఎన్జీఓ, టీజీఓ నేతలు తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, టీజీఓ అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కలిశారు. ఐదేళ్ల గడువు ముగిసినందున ఉద్యోగులకు వేతన సవరణ ఇవ్వాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని సీఎంను కోరారు.
ఉద్యోగుల ఆరోగ్య పథకం పైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల్లో మళ్లీ సమావేశం అవుతానని.. వేతన సవరణ కమిషన్‌తో పాటు మధ్యంతర భృతి ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఆరోగ్య పథకం కూడా ఇప్పటికే పూర్తిగా సిద్దమైందని, సీఎం అప్పుడే నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు. రేపు లేదా ఎల్లుండి వేతన సవరణ కమిషన్, మధ్యంతర భృతిపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేస్తారని నేతలు తెలిపారు.
2021లో వేతనాల పెంపు.. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి అయిదు సంవత్సరాలకొకసారి వేతన సవరణ ఉంటుంది. గతంలో 2018 మే 18వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నేతృత్వంలోఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో ఏర్పాటైన పీఆర్సీ కమిషన్.. 2020 డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది.