నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకుగాను చేపట్టిన నిరాహారదీక్షకు పోలీసులు అనుమతివ్వకపోవడం శోచనీయమని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నిరుద్యోగ యువత, వ్యవసాయ సంక్షోభంతో దిగాలుపడ్డ రైతులు, దైన్యంలో ఉన్న ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోదండరాం 48 గంటల దీక్షకు దిగారు. మొదటగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షను నిర్వహించాలని నిర్ణయించగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షకు కూర్చున్నారు. కోదండరాం దీక్షకు సీపీఐ, సీపీఎం, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ, ప్రముఖ విద్యవేత్త చుక్కా రామయ్య సంఘీభావం తెలిపారు.
ఆరేళ్లయినా
ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణమని.. దీంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలు పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయం కూడా సంక్షోభంలో కూరుకుపోయిందని.. అన్నదాతలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోరాటం ఆపేదిలేదని స్పష్టం చేశారు.
ఎక్కడికక్కడే దీక్షకు కూర్చోవాలి