ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టడంతోపాటు ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ప్రభుత్వం ప్రగతిభవన్‌కే సొంతం అన్నట్లుగా ఉందని.... మంత్రులంతా హుజురాబాద్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఒక్క మంత్రి స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కోదండ రాం, పార్టీ నేతలు.. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
సంఘటితం కావాలి
ఎన్నికలప్పుడే ప్రభుత్వానికి అభివృద్ధి పథకాలు గుర్తుకొస్తాయని... ఆ తర్వాత మరిచిపోతున్నారని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు డబ్బు చుట్టూ తిరుగుతున్నాయని అన్నారు. ఉపాధి కల్పన లక్ష్యంగా.. మంచి వైద్యం, విద్య కోసం అందరూ సంఘటితం కావాల్సిన అవసరముందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రభుత్వాధికారాన్ని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.