కరోనాతో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ నేపథ్య గాయకుడు జై శ్రీనివాస్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) ప్రకటించింది. దేశం గర్వించేలా శ్రీనివాస్ పాడిన పాట ప్రతిచోట వినిపిస్తుందని.. అలాంటి గాయకుడి మరణంతో ఆ కుటుంబం దీనావస్థలో ఉండటం తమను కలచివేసిందని టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు వెంగళ్రావునగర్లోని జై శ్రీనివాస్ నివాసానికి వెళ్లి.. కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించనున్నట్లు టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ మక్తాల పేర్కొన్నారు. టీటా తరఫున కుటుంబానికి పూర్తి సహకారం అందించనున్నట్లు వెల్లడించారు.
స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో దేశభక్తిని రగల్చడంలో పాటలు ప్రముఖ పాత్ర పోషించాయి. కవులు, రచయితలు తమ కలాలను ఎక్కుపెట్టి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించారు. గాయకులు గొంతెత్తి పాడి నింగీ నేలను ఏకం చేసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించారు. అలాంటి కోవలోకే వస్తాడు జై శ్రీనివాస్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేజ దర్శకత్వంలో వచ్చిన జై చిత్రంలో 'దేశం మనదే.. తేజం మనదే' పాట పాడి కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడు. తెలంగాణ ఉద్యమంలోనూ అనేక గీతాలు పాడి ప్రజలను చైతన్యపరిచారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు శ్రీనివాస్ గళం వినిపించింది. ఆంగ్లచిత్రం ది ఇండియన్ పోస్ట్ మ్యాన్‌లో బతుకమ్మ పాటపాడిన తొలి తెలుగు గాయకుడిగా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
కబళించిన కరోనా..
కీరవాణి, అనూప్ రూబెన్స్ సంగీత బృందంలో ఎన్నో చిత్రాలకు పని చేశాడు. ఇటీవల కరోనా వైరస్ ఆ గాన గంధర్వుడిని కబళించింది. ఒక్క పాటతో ప్రతీ తెలుగోడి అభిమానాన్ని చూరగొన్న జై శ్రీనివాస్ మరణం అతని కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా చేసింది. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలున్నారు. భార్య స్వాతి గృహిణి కాగా.. పెద్దమ్మాయి అభిజ్ఞ ఎనిమిదో తరగతి చదువుతుంది. చిన్నమ్మాయి జైత్ర ఐదో తరగతి చదువుతుంది. జై శ్రీనివాస్‌ను కాపాడుకునేందుకు భార్యాపిల్లలు, కుటుంబసభ్యులు ఎంతో శ్రమించారు. అప్పులు చేసి రూ.27 లక్షలు ఖర్చు చేసినా.. ప్రాణాలు దక్కలేదు. పాటలు పాడేందుకు కోలుకుని తిరిగొస్తానని చెప్పిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. తండ్రి ఆశయాలను నెరవేర్చుతామని బాధాతప్త హృదయాలతో చెబుతున్నారు.