అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తుందని... కానీ సమస్యల్లో నుంచి అవకాశాలు వెతుక్కోవాలని టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల పేర్కొన్నారు. అమెరికా టెక్నాలజీ కంపెనీలు... ఆ దేశ ఆర్థిక పరిపుష్టిలో భారతీయులుగా ప్రత్యేకంగా తెలుగువారిగా మన టెక్కీల సహాయం ఎంతో ఉందని సందీప్ మక్తాల పేర్కొన్నారు.
''ఐటీ రంగం అనేది ప్రధానంగా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ వీసాల ఆంక్షాల కారణంగా అమెరికా కంపెనీలు స్థానికులను మాత్రమే నియమించుకోవాలంటే వారికి తప్పకుండా అధిక వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు అక్కడి స్థానికులు ఇతర దేశాలతో పోటీ పడే నైపుణ్యాలు కలిగి లేరనే విషయాన్ని కంపెనీలు గుర్తించాయి. ఇలాంటి సవాళ్ల నేపథ్యంలో ఆంక్షల అమలు అంత సులభం కాదు. కాబట్టి అక్కడున్న మన టెక్కీలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇతర కంపెనీల్లో జీతాలు, ప్రమోషన్ల అవకాశాలు వచ్చినా ఆన్‌సైట్ అవకాశం కోసం పని చేస్తున్నవారు ఆందోళన చెందే అవకాశం ఉంది. విదేశీ అవకాశం పోయిందని ఆందోళన వద్దు.. మన దేశంలోనే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని కొత్త ఉత్పత్తులు, సేవలు అందించడంపై దృష్టి పెట్టాలి.