తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనం, బస, కల్యాణ మండపాలు తదితర ఆన్‌లైన్ సేవలతో పాటు ఈ-డొనేషన్స్ సౌకర్యార్థం నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తితిదే శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.inగా మార్పు చేసినట్లు వెల్లడించింది. ఈనెల 23 నుంచి ఇది అమల్లోకి రానుంది. తితిదే పేరుతో పుట్టుకొచ్చిన నకిలీ వెబ్‌సైట్ల వల్ల భక్తులు మోసపోకుండా కొత్తది రూపొందించినట్లు వివరించింది. భక్తులను మోసం చేసిన 20 సైట్లపై కేసులు నమోదైనట్లు తెలిపింది.
మార్పు ఎందుకంటే...
కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌లో తిరుపతి, బాలాజీ, ఏపీ.గవ్..పదాల కూర్పుపై వివరణ ఇస్తూ.. ‘ఉత్తరాది రాష్ట్రాల వారు శ్రీవేంకటేశ్వరస్వామిని బాలాజీ పేరుతో కొలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల వారు తిరుపతి యాత్రగా పిలుస్తారు. ఈ రెండు పదాలతోనే గూగుల్‌లో వెతకడం ద్వారా నకిలీ వెబ్‌సైట్ల బారిన పడుతున్నారు. కొత్త వెబ్‌సైట్‌లో ఈ రెండు పదాలను చేర్చినందున అధికారిక సైట్ ఓపెన్ అవుతుంది. కేవలం డొమైన్‌లో తప్ప అప్లికేషన్స్‌లో మార్పులు చేయలేదు. ap.gov.in అనేది రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ పరిధిలోకి వస్తుంది. ap.gov.in పేరుతో నకిలీ వెబ్‌సైట్లు తీసుకురావడం అంత సులువు కాదని పేర్కొంది.