తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ సంచిని నాటితే... మొక్కవుతుంది.. - telangana news

ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తోంది. లడ్డూ ప్రసాదాల కోసం వృక్షప్రసాదాన్ని అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణహిత సంచుల్లో తులసి విత్తనాలు పొందుపరిచి భక్తులకు అందజేస్తోంది. 'గ్రీన్‌ మంత్ర' సంస్థ సహకారంతో చేపట్టిన ఈ ప్రయత్నానికి మంచి ఆదరణ లభిస్తోంది.

tirumala tirupathi devasthanam -is-an-innovative-experiment-to-prevent-the-use-of-plastic in andhra pradesh
ప్లాస్టిక్‌ వినియోగం నివారణకు తితిదే వినూత్న ప్రయోగం

By

Published : Mar 16, 2021, 9:53 AM IST

ప్లాస్టిక్‌ వినియోగం నివారణకు తితిదే వినూత్న ప్రయోగం

వైకుంఠనాథుని నిలయం తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు తితిదే చర్యలు ముమ్మరం చేసింది. ప్రణాళికాబద్ధమైన పద్ధతులతో తిరుమల కొండను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతోంది. ఈ దిశగా మంచినీరు, శీతలపానీయాల ప్లాస్టిక్‌ సీసాలను పూర్తిగా నిషేధించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలను తీసుకెళ్లే కవర్ల వినియోగాన్ని కట్టడి చేసేందుకు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ సహకారంతో 'గ్రీన్‌ మంత్ర' సంస్థ రూపొందించిన సంచులపై తితిదే దృష్టిసారించింది.

'గ్రీన్‌ మంత్ర' సంస్థ రూపొందించిన ఈ సంచులు ప్లాస్టిక్‌ కవర్లను పోలి ఉంటాయి. కంద మూలాలతో తయారుచేసిన ఈ సంచుల్లో రెండు, మూడొందల తులసి విత్తనాలను పొందుపరచి భక్తులకు అందజేస్తున్నారు. సంచుల్ని పడేసిన కొన్ని రోజులకు పూర్తిగా కుళ్లి భూమిలో కలిసిపోయి... తులసి మొక్కలు మొలకెత్తేలా రూపొందించారు. దీనినే వృక్షప్రసాదంగా తితిదే పరిచయం చేసింది. 5 లడ్డూలకు సరిపడే సంచుల్ని 3 రూపాయలు, 10 లడ్డూలకు సరిపడే కవర్లను 6 రూపాయలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఈ సీడ్‌ ఎంబెడెడ్ సంచుల వల్ల ప్లాస్టిక్‌ వినియోగం తగ్గడంతో పాటు మొక్కలు పెరిగి పర్యావరణానికి మేలు జరుగుతుందని 'గ్రీన్‌ మంత్ర' సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.

వృక్షప్రసాదం వినియోగం పట్ల భక్తులు ఆసక్తి చూపుతున్నారు. తితిదే ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నారు. ప్రయోగాత్మగంగా వృక్ష ప్రసాదం విక్రయాలను ప్రారంభించిన గ్రీన్‌ మంత్ర సంస్థ... భక్తుల నుంచి వస్తున్న ఆదరణతో పూర్తిస్థాయి అమలుకు చర్యలు ప్రారంభించింది.

ఇవీ చదవండి:యాదాద్రిలో రెండో రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details