తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటి నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం - శ్రీవారి దర్శనానికి నిరీక్షణే..వారం టోకెన్లూ అయిపోయాయ్‌!

తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకుంటున్న దూర ప్రాంత భక్తులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. వచ్చే బుధవారం దాకా సర్వదర్శనం టోకెన్ల జారీ ఈరోజు(గురువారం) మధ్యాహ్నం కల్లా పూర్తి కానుంది. నేటి నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించిన తితిదే.. రోజుకు 6 వేల మందికి అవకాశం ఉంటుందని ప్రకటించింది. ఇందులో 3 వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300 టికెట్‌) కింద ఆన్‌లైన్‌లో, మరో 3 వేల మందికి సర్వదర్శనం పేరిట ఆఫ్‌లైన్‌లో టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది.

tirumala-temple-news
నేటి నుంచి సాధారణ భక్తులకు శ్రీవారి దర్శనం

By

Published : Jun 11, 2020, 7:07 AM IST

ఆఫ్‌లైన్‌ టోకెన్లను దర్శనానికి ఒకరోజు ముందు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని ప్రత్యేక కౌంటర్లలో ఆధార్‌ తనిఖీ చేసి ఐరిస్‌ తీసి అందిస్తోంది. గురువారం నాటి దర్శనం కోసం బుధవారం ఉదయం 5 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించగా వేలాది మంది అక్కడికి చేరుకున్నారు. తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారు భారీగా రావడంతో తొలిరోజు కోటా టోకెన్లు గంటల్లోనే అయిపోయాయి. అయినా వేలాది మంది వరుసల్లో నిలిచిపోవడంతో పరిస్థితిని సమీక్షించిన అధికారులు.. అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. మరో మూడు రోజుల దర్శనం టోకెన్లనూ ఇవ్వాలని నిర్ణయించారు. వెరసి శుక్ర, శని, ఆదివారాల టోకెన్లూ ఇచ్చేశారు. ఆ తర్వాత సోమ, మంగళ, బుధవారాలకు (జూన్‌ 15, 16, 17) సంబంధించిన టోకెన్లను నేటి ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

వస్తే.. చిక్కుకుపోవడమే...

ఆన్‌లైన్‌ టికెట్‌ లేకపోయినా... ఆఫ్‌లైన్‌లో ఒకరోజు ముందు టోకెన్లు తీసుకోవచ్చన్న భరోసాతో తిరుపతికి వచ్చే భక్తులకు ఈ పరిణామంతో నిరాశ తప్పదు. నేటి మధ్యాహ్నంలోగా టోకెన్‌ తీసుకున్నా.. సోమ, మంగళ, బుధ వారాల్లోనే దర్శనం ఉంటుంది. ఆ టోకెన్‌ కూడా దొరకని పక్షంలో సోమవారం దాకా తిరుపతిలో నిరీక్షించాల్సిందే. ఆ తర్వాత దర్శనం జూన్‌ 17న నుంచి లభిస్తుంది. ఈ లెక్కన చూస్తే దూరప్రాంతాల భక్తులు పర్యటన వాయిదా వేసుకోవడమే మేలని అర్థమవుతోంది. నడక దారి భక్తులకు ప్రత్యేక కోటా లేదు. దర్శనం టోకెన్లు కలిగిన భక్తులనే అలిపిరి నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు.ఈ నెల 8,9 తేదీల్లో తిరుమల హుండి ఆదాయం రూ.47లక్షలు వచ్చినట్లు తితిదే అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:7.5 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details