తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా.. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీలో జాప్యం అవుతోంది. ఉదయం 11 గంటలకే టికెట్లు విడుదల చేస్తామని తితిదే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు టికెట్లు విడుదల కాలేదు. రోజుకు మూడు వేల టికెట్ల చొప్పున శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపిన టీటీడి... సాంకేతిక సమస్య కారణంగా టికెట్ల జారీ ఆలస్యమైనట్లు వెల్లడించింది. సమస్యను టీసీఎస్ సంస్థ పరిష్కరిస్తోందని... కాసేపట్లో టికెట్లు విడుదల చేయనున్నట్లు తితిదే తెలిపింది.
4 నెలలుగా 300 నుంచి 10 వేల రూపాయల వరకు ఏదో ఒకస్థాయిలో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు మినహా.... సాధారణ ప్రజలు శ్రీవారిని దర్శించుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా రెండో దశలో(CORONA SECOND WAVE) కేసుల ఉద్ధృతి వల్ల ఏప్రిల్ 11 నుంచి తిరుమలేశుని దర్శనంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం జారీ చేసే సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల(TIME SLOTS TOKENS) జారీ కేంద్రాలను అధికారులు మూసేశారు. కానీ ఆన్‌లైన్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం(KALYANOTHSAVAM), వసంతోత్సవం(VASANTHOTHSAVAM), సహస్ర దీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం(Arjitha Brahmotsavam)టిక్కెట్లను విక్రయిస్తూ దర్శనాలు కల్పిస్తోంది.