తిరుమల(Tirumala) శ్రీవారి సర్వదర్శనం కోసం సామాన్య భక్తులు ఆశగా నిరీక్షిస్తున్నారు. కరోనా మొదటి దశ సమయంలో గతేడాది మార్చి 20 నుంచి జూన్ 8వ తేదీ వరకు దాదాపు 80 రోజుల పాటు భక్తులకు దర్శనాలను నిలిపివేసి శ్రీవారి కైంకర్యాలను తితిదే ఏకాంతంగా నిర్వహించింది. కరోనా రెండో దశ ప్రభావంతో ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు సర్వదర్శనం టికెట్లను జారీ చేయలేదు. దీంతో పేద, సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు.
శ్రీవారి దర్శనం లేక..
ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో సర్వదర్శనం ద్వారా సాధారణ భక్తులకు దేవుడి దర్శనభాగ్యం కల్పించడం పరిపాటి. తిరుమలలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 4 నెలలుగా 300 నుంచి 10 వేల రూపాయల వరకు ఏదో ఒకస్థాయిలో టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు మినహా.... సాధారణ ప్రజలు శ్రీవారిని దర్శించుకోలేని పరిస్థితి నెలకొంది. కరోనా రెండో దశలో కేసుల ఉద్ధృతి వల్ల ఏప్రిల్ 11 నుంచి తిరుమలేశుని దర్శనంపై ఆంక్షలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తుల కోసం జారీ చేసే సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలను అధికారులు మూసేశారు. కానీ ఆన్‌లైన్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల జారీని మాత్రం కొనసాగిస్తున్నారు. అలాగే కల్యాణోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లను విక్రయిస్తూ దర్శనాలు కల్పిస్తోంది.