Parenting Tips To Guide Teenagers : యవ్వనంలో ఉన్నప్పుడు ప్రేమ, డేటింగ్.. వంటి వాటికి త్వరగా ఆకర్షితులవుతుంటారు పిల్లలు. ఇందుకు ఆ వయసులో హార్మోన్ల ప్రభావం కావచ్చు.. లేదంటే తోటి పిల్లలు/తెలిసిన వారిని చూసి తామూ అలా చేయాలనుకోవచ్చు. ఇలా కారణమేదైనా.. ఇలాంటి అనుబంధాల గురించి వారికి సరైన అవగాహన లేకపోవడం.. ఏది మంచో, ఏది చెడో తెలియకపోవడం వల్ల వాళ్లు తప్పుడు మార్గాన్ని ఎంచుకునే ప్రమాదం ఉంటుంది. అలా జరగకూడదంటే ఈ విషయాల గురించి పేరెంట్సే తమ పిల్లలకు సున్నితంగా వివరించాలంటున్నారు నిపుణులు.
మీ అనుభవాలే పాఠాలుగా:యుక్త వయసులో ఉన్నప్పుడు చాలామందికి ఫస్ట్ క్రష్, ప్రేమ.. వంటి అనుభవాలు ఉండే ఉంటాయి. అలాగని అన్ని ప్రేమకథలు సక్సెస్ అవుతాయని చెప్పలేం. మరి, మీకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? అవే మీ పిల్లలకు పాఠాలుగా చెప్పచ్చు. ఈ క్రమంలో మొహమాటపడడం, అనవసరంగా వారిలో లేనిపోని ఆశలు రేకెత్తించినట్లవుతుందేమోనని సందేహించాల్సిన పనిలేదు. అయితే ఈ క్రమంలో మీరు మీ ప్రేమలో గెలిచారా? లేదంటే విఫలమయ్యారా? అందుకు కారణాలేంటి? వంటివన్నీ వారికి సునిశితంగా వివరించాలి.
అలాగే గెలిచిన ప్రేమకథల్ని పరిశీలిస్తే.. చాలావరకు ముందు కెరీర్‌కి ప్రాధాన్యమిచ్చి.. ఆ తర్వాత ప్రేమను పెళ్లి దాకా నడిపించిన వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. మీరూ ఇందుకు మినహాయింపు కాకపోతే.. ఆ విషయాన్ని కూడా మీ పిల్లలకు చెప్పడానికి వెనకాడకూడదు. తద్వారా జీవితంలో దేనికెంత ప్రాధాన్యమివ్వాలో వారికి అర్థమవుతుంది. ఇలా మీ అనుభవాలే వారికి ప్రేమ, ఆకర్షణ, డేటింగ్.. వంటి విషయాలపై కనీస అవగాహన కల్పిస్తాయి. ఇలా మీరు చెప్పకపోయినా పిల్లలు తెలుసుకోలేరని కాదు.. కాకపోతే అంతర్జాలం, ఇతర మార్గాల ద్వారా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనే ఆరాటంలో వారు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దానికంటే ఈ విషయంలో మీరే గురువు అవడం మంచిదంటున్నారు నిపుణులు.
స్నేహితులవ్వండి:‘ఈ పెద్దాళ్లున్నారే.. పిల్లల ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోరు..’ అన్న భావన ఇప్పుడున్న చాలామంది పిల్లల మనసుల్లో ఉంది. అందుకే తెలిసీ తెలియని వయసులో వారు ప్రేమలో పడ్డా, వేరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా.. ఇంట్లో వాళ్లకు తెలియకుండా రహస్యంగా ఉంచుతుంటారు. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేద’న్నట్లుగా.. తీరా ఏదో ఒక తప్పు జరిగాక దాని గురించి తెలిసినా సరిదిద్దుకోలేం. అందుకే పిల్లలు ఇలాంటి పొరపాట్లు చేయకుండా.. వారి మనసులోని విషయాలన్నీ మీతో చెప్పాలంటే వాళ్లతో స్నేహం చేయడం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు.
అలా కాకుండా ప్రతి విషయంలో వారితో కఠినంగా వ్యవహరించడం, వాళ్లు చెప్పేది పూర్తిగా వినకుండా మీ మాటే నెగ్గాలనుకోవడం, చీటికీ మాటికీ కసుర్లు-విసుర్లు.. ఇలాంటి ప్రవర్తన ఉన్న తల్లిదండ్రులతో ఏ విషయం పంచుకోవాలన్నా పిల్లలు భయపడుతుంటారు. కాబట్టి తెలియక తప్పు చేసినా అది మీతో చెప్పడానికి జంకుతుంటారు. అందుకే పిల్లలతో ఎంత ఫ్రెండ్లీగా మెలిగితే అంత మంచిదంటున్నారు నిపుణులు.
వలపు వలకు చిక్కకుండా:విదేశాల నుంచి దిగుమతి అయి మన దేశంలోనూ పాతుకుపోయింది డేటింగ్ సంస్కృతి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వందలు, వేల సంఖ్యలో డేటింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. వీటిలో నకిలీ సైట్లు కూడా ఉంటున్నాయి. యువత ఒకరిని చూసి మరొకరు వీటికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో- మోసపూరిత డేటింగ్ సైట్లతో వ్యక్తిగత సమాచారం పంచుకోవడం వల్ల లేని పోని అనర్ధాలు తలెత్తే ప్రమాదం ఉంది.