తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana New Secretariat : 1300 కళ్లు.. 300 కెమెరాలు.. నిఘా నీడలో సచివాలయం - కొత్త సచివాలయానికి పటిష్ఠ భద్రత

Tight Security at Telangana New Secretariat : కొత్త సచివాలయానికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. ఎస్‌పీఎఫ్‌ నుంచి స్పెషల్‌ పోలీస్‌ చేతికి సచివాలయ భద్రత బాధ్యతలు మారనున్నాయి. ఏఆర్‌తోపాటు నగర పోలీసులూ సచివాలయ భద్రతలో నిమగ్నం కానున్నారు. నిరంతర పర్యవేక్షణ కోసం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.

Tight Security
Tight Security

By

Published : Apr 19, 2023, 8:19 AM IST

Tight Security at Telangana New Secretariat : తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోంది. ఈ క్రమంలో సచివాలయ భద్రత బాధ్యత చేతులు మారబోతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారాల్ని ఎస్‌పీఎఫ్‌(ప్రత్యేక భద్రతాదళం) పర్యవేక్షిస్తుండగా.. ఇకపై ఆ భాద్యత టీఎస్‌ఎస్‌పీ (రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌) చేతుల్లోకి రాబోతోంది. ప్రస్తుతం దాదాపు 100 మంది ప్రత్యేక భద్రతాదళం సిబ్బందితో భద్రత కొనసాగుతుండగా నూతన సచివాలయంలో 650 మందికి పైగా పహారా కాయనున్నారు. ఇప్పటికే పలు విడతలుగా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాల అనంతరం కొత్త సచివాలయ భద్రత బాధ్యతలను టీఎస్‌ఎస్‌పీ చేతికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Telangana New Secretariat : మూడు పటాలాల (350 మందికి పైగా) టీఎస్‌ఎస్‌పీ(రాష్ట్ర స్పెషల్‌ పోలీస్‌) సిబ్బందితో పాటు దాదాపు 300 మంది ఏఆర్‌ (సాయుధ రిజర్వు), శాంతిభద్రతల పోలీసులు ఈ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సమాచారం. అదేవిధంగా వచ్చిపోయే వాహనాల రాకపోకల నియంత్రణకు 22 మంది ట్రాఫిక్‌ పోలీసులనూ కేటాయిస్తున్నారు. ఇప్పటికే మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ)లో ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ నెల 23 లేదా 24 నుంచి ఈ భద్రతా సిబ్బంది పర్యవేక్షణ ప్రారంభం కానుంది.

బార్‌కోడ్‌ పాస్‌ అనుమతిస్తేనే లోపలికి : నూతనసచివాలయానికి వచ్చే సామాన్యులు ముందస్తు అనుమతి ఉంటే తప్ప లోపలికి వెళ్లే వీల్లేదు. వారు కొత్త సచివాలయంలో ఏ బ్లాక్‌ను సందర్శించాలో అక్కడికి మాత్రమే వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ప్రవేశద్వారం వద్ద బార్‌కోడ్‌తో కూడిన పాస్‌లు ఇవ్వనున్నారు. ఆ పాస్​లతో నిర్దేశిత బ్లాకుకు మాత్రమే వెళ్లే అవకాశం కల్గుతుంది. సచివాలయంలోని ఇతర బ్లాకులకు వెళ్లాలంటే కుదరదు. అయితే ఈ వ్యవహారాలన్నింటినీ హైదరాబాద్‌ నగర పోలీస్‌ విభాగం పర్యవేక్షించనుంది.

6 సెంట్రీ పోస్టులు.. అనుక్షణం చుట్టూ కెమెరాల పర్యవేక్షణ :కొత్తసచివాలయానికి నాలుగువైపులా ఏర్పాటు చేసిన సెంట్రీ పోస్టుల్లో నిరంతరం అక్కడ కేటాయించిన సాయుధ సిబ్బంది పహారా కాస్తారు. అదేవిధంగా ప్రవేశమార్గాల్లోని మరో రెండు సెంట్రీ పోస్టుల్లోనూ పహారా ఉండనుంది. అలాగే వీరితోపాటు సీఎం కార్యాలయం, ప్రధాన ప్రవేశద్వారం వంటి కీలక ప్రాంతాల్లో కాపలా సిబ్బందికి అధునాతన ఆయుధాలు సమకూర్చనున్నారు.

  • సచివాలయంలోని ఆరు అంతస్తుల్లోని మెట్లమార్గంతో పాటు లిఫ్ట్‌ల వద్ద పోలీసు పర్యవేక్షణ ఉంటుంది.
  • కొత్త సచివాలయంలో నిరంతర పర్యవేక్షణ కోసం 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా వాటి దృశ్యాల పరిశీలనకు ప్రత్యేకంగా కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • అదేవిధంగా సచివాలయంలో తనిఖీల కోసం అధునాతన బాడీ, బ్యాగేజీ, వాహనాల స్కానర్లను అందుబాటులోకి తెచ్చారు.
  • అలాగే అగ్నిప్రమాదాల నియంత్రణకు రెండు అగ్నిమాపక శకటాలను, 34 మంది ఫైర్​ సిబ్బందిని సచివాలయం ఆవరణలోనే ఉంచనున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details