Tigers in Telangana state forests : దేశంలోని పులుల స్థితిగతులపై జాతీయ పులుల సంరక్షణా సంస్థ (ఎన్టీసీఏ) నివేదిక విడుదల చేసింది. నాలుగేళ్లకోమారు పులుల సంఖ్య, పరిస్థితిపై క్షేత్రస్థాయిలో వివిధ పద్ధతుల్లో అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తుంటారు. 2022 నాటికి పులుల నివేదికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విడుదల చేశారు. రాష్ట్రాల వారీగా పులుల సంఖ్య వివరాలు ఇంకా వెళ్లడించలేదు. అయితే ఆయా ప్రాంతాల్లో పులుల స్థితిగతులు, వాతావరణాన్ని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలను పేర్కొంది.
రాష్ట్రంలో పులుల సంఖ్య తగ్గుతోందని నివేదిక తెలిపింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్, చెన్నూరు ప్రాంతాల్లో ఉన్న పులులు అక్కడి నుంచి వెళ్లిపోతున్నాయని పేర్కొంది. అయితే పులుల సంరక్షణ, అటవీ నిర్వహణ చర్యలు పటిష్ఠంగా చేపడితే మళ్లీ పెరిగే అవకాశం ఉందని కూడా తెలిపింది. వన్యప్రాణులు, మానవుల మధ్య సంఘర్షణ నివారించాలని.. అటవీ ప్రాంతాల్లో వేటను అరికట్టాలని.. అటవీ ప్రాంత ఆక్రమణ.. మానవుల ప్రమేయంతో అడవుల్లో అగ్నిప్రమాదాలు.. లాంటి వాటికి ఆస్కారం లేకుండా చూడాలని పేర్కొంది.
పులులు, వన్యప్రాణులకు మంచి అనువైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. టైగర్ రిజర్వ్‌ల నిర్వహణలో రాష్ట్రానికి చెందిన అమ్రాబాద్ 78.79 శాతం స్కోర్‌తో వెరీ గుడ్ కేటగిరీలో నిలిచింది. కవ్వాల్ 74.24 శాతం స్కోర్‌తో గుడ్ కేటగిరీలో నిలిచింది. రాష్ట్రంలో 26కు పైగా పులులు ఉన్నట్లు 2018 సర్వేలో తేలింది. అమ్రాబాద్‌లో 16, కవ్వాల్‌లో పది పులులు ఉన్నట్లు అప్పుడు అంచనా వేశారు. 2022 నివేదిక పూర్తి వివరాలు వెల్లడైతే పులులు తాజా స్థితిపై స్పష్టత వస్తుంది.
దేశంలో పెరిగిన పులుల సంఖ్య..:ఇదిలా ఉండగా..దేశంలో 2022 నాటికి 3,167 పులులు ఉన్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కర్ణాటకలోని బండీపుర టైగర్ రిజర్వ్‌ను మోదీ ఆదివారం సందర్శించారు. అనంతరం రాచనగరిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వ విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్'ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా పులి, సింహం సహా ప్రపంచంలోని 7 పెద్ద పెద్ద జంతువుల రక్షణపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు. ప్రధాని విడుదల చేసిన లెక్కల ప్రకారం దేశంలో పులుల సంఖ్య 2006లో 1,411గా ఉండగా.. 2010లో 1,706, 2014లో 2,226, 2018లో 2,967, 2022 నాటికి 3167కు చేరింది.
ఇవీ చదవండి: