తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో మూడేళ్ల చిన్నారికి కరోనా.. 41కి చేరిన కేసులు - 3years boy affected by corona

రాష్ట్రంలో అతిపిన్న వయస్కుడైన.. చిన్నారిలో కరోనా వెలుగుచూసింది. ఎన్నడూ లేని విధంగా మూడేళ్ల చిన్నారికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్న వైద్యారోగ్య శాఖ... ఇటీవలే సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో 43 ఏళ్ల మహిళకు కరోనా సోకడం వల్ల రాష్ట్రంలో కాంటాక్ట్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 813 మంది కరోనా కాంటాక్ట్ లక్షణాలు ఉన్నవారు వైద్యుల సంరక్షణలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో మూడేళ్ల బాలుడికి కరోనా
రాష్ట్రంలో మూడేళ్ల బాలుడికి కరోనా

By

Published : Mar 26, 2020, 6:01 AM IST

రాష్ట్రంలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బాధితుల సంఖ్య 41కి చేరింది. 43 ఏళ్ల మహిళతోపాటు, మూడేళ్ల చిన్నారిలో కరోనా లక్షణాలున్నట్లు... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని 43 ఏళ్ల మహిళ... విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోయినా... ఇటీవల ఆమె కుటుంబసభ్యుల్లో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. కుటుంబ సభ్యుల ద్వారా మహిళకు వైరస్‌ సోకగా... రాష్ట్రంలో కాంటాక్ట్‌ కేసుల సంఖ్య 6కి చేరుకుందని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

మూడేళ్ల చిన్నారికి..

ఇదే సమయంలో... తొలిసారి మూడేళ్ల చిన్నారిలోనూ.. కరోనా మహమ్మారి వెలుగుచూసింది. భాగ్యనగరానికి చెందిన 3 ఏళ్ల బాలుడు ఇటీవలే సౌదీ నుంచి వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. బాలుడి వివరాలను గోప్యంగా ఉంచిన అధికారులు... కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో నలుగురు 60 ఏళ్ల పైబడిన వారు కాగా... ఒక్క యువతికి 18ఏళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న.... రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 813మంది... కరోనా కాంటాక్ట్‌ లక్షణాలతో వైద్యుల సంరక్షణలో ఉన్నారు.

కట్టుదిట్టమైన చర్యలు..

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల మహమ్మారి కట్టడికి సర్కారు మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోలాక్‌డౌన్‌ అమలు చేస్తుండగా... మంత్రి ఈటల ఎప్పటికప్పుడు వైద్యులతో పరిస్థితిని సమీక్షిస్తూ.. దిశానిర్దేశం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ వల్ల డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్న ఫిర్యాదులొచ్చాయి. స్పందించిన ఈటల.. డయాలసిస్, క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు వీలుగా ప్రత్యేక పాస్‌లు జారీచేస్తామని తెలిపారు.

కరోనా చికిత్స అందించే వైద్యులకు వ్యాధి సోకకుండా... అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈటల రాజేందర్‌ వివరించారు. ప్రజలు కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని... లాక్‌డౌన్ ఉన్న రోజుల్లో ఇళ్ల నుంచి అత్యవసరమైతే తప్ప బయటకురావొద్దని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వడం అత్యవసరమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ABOUT THE AUTHOR

...view details