సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్డులో ఉన్న దక్కన్ నిట్వేర్ భవన అగ్ని ప్రమాదం విద్యుదాఘాతం వల్ల జరగలేదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. ఆరో అంతస్తు నుంచి మంటలు రావడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆరోపించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఈ ప్రాంతంలో విద్యుత్ నిలిపివేసినట్లు ఆయన వివరించారు. మంటలు వ్యాపిస్తున్న సమయంలో విద్యుత్ మీటర్లో విద్యుత్ సరఫరా అవుతుందని.. షార్ట్ సర్క్యూట్ అసలు ప్రమాదానికి కారణం కాదని విద్యుత్‌శాఖ అధికారి శ్రీధర్ స్పష్టం చేశారు. అసలు షార్ట్ సర్క్యూట్ ఉంటే సబ్‌స్టేషన్‌లో ట్రిప్ అయ్యేది కదా అని ప్రశ్నించారు. కానీ సబ్‌స్టేషన్‌లో అలా జరగలేదన్నారు. నిన్న అగ్ని ప్రమాదం జరిగిందని ఫోన్ రాగానే వెంటనే ఆ ప్రాంతానికి విద్యుత్‌ను నిలిపివేశామని చెప్పారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే మీటర్లు, విద్యుత్ తీగలు కాలిపోయేవని వెల్లడించారు.
భవన యజమాని పరారీ:సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే భవన యజమాని జావేద్ పరారీ అయ్యాడు. ఇతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోనే పనిలో పోలీసులు పడ్డారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. భవనం చుట్టూ మంటలు వ్యాపించగానే 17మంది కూలీలు భవనం నుంచి బయటకొచ్చారని స్థానికులు తెలిపారు. సామాగ్రి కోసం లోపలికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు లోపల చిక్కుకు పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. చిక్కినపోయిన ఈ ముగ్గురు వ్యక్తులు గుజరాత్‌కి చెందిన కార్మికులుగా గుర్తించారు. వీరు జునైద్, జహీర్, వసీంగా స్థానికులు వెల్లడించారు.