దేశవ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపాలనే పట్టుదలతో చేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో సరికొత్త సవాల్‌కు సిద్ధమైంది. ఈ నెల 24న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు కోట్ల మొక్కలు నాటేలా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్ సంకల్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కొనసాగింపుగా కేటీఆర్ పుట్టిన రోజు నాడు మూడు కోట్ల మొక్కలు నాటి బర్త్ డే గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నెల 24న ఉదయం పది గంటలకు ప్రారంభించి ఒక్క గంటలో మూడు కోట్ల మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటనున్నారు.
దీనికి సంబంధించిన బ్రోచర్‌ను మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ కే కేశవ రావు, బాల్క సుమన్, గాదరి కిషోర్‌కుమార్, సైదిరెడ్డి చేతుల మీదుగా ఎంపీ సంతోశ్ కుమార్ ఆవిష్కరించారు. తెరాస నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని... ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఎంపీ సంతోశ్ కోరారు. వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఎంపీ సంతోశ్‌ను ఎంపీ కే.కేశవరావు అభినందించారు.