అప్పటివరకు ఆడిపాడిన చిన్నారులు అప్పుడే నిద్రకు ఉపక్రమించారు. అంతలోనే ఓ పాతగోడ వారిని మృత్యురూపంలో కబలించింది. ఈ విషాద ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. మరో చిన్నారి గాయాలపాలైంది.
గోడకూలి నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి - హైదరాబాద్‌లో గోడకూలి ముగ్గురు చిన్నారుల మృతి
హైదరాబాద్ హబీబ్‌నగర్ పరిధి అఫ్జల్‌సాగర్ రోడ్డులోని మాన్‌గరి బస్తీలో విషాదం చోటుచేసుకుంది. గోడకూలి నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. అప్పటివరకు ఆడిపాడిన చిన్నారులు... అంతలోనే విగతజీవుల్లా మారారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో... ఆ కుటుంబం విషాదంలో మునిగింది.
హైదరాబాద్ హబీబ్‌నగర్ పరిధిలోని మాన్గారి బస్తీలో... మీఠాలాల్ కుటుంబం నివాసముంటోంది. అతని ముగ్గురు కుమార్తెలతో పాటు.. సోదరుని కూతురు ఇంట్లో ఆడుకున్నారు. అప్పటివరకు ఆడుకున్న చిన్నారులు నిద్రలోకి జారుకున్నారు. అంతలోనే ఇంట్లోని పాత గోడ కూలి చిన్నారులపై పడింది. తీవ్ర గాయాలైన ఆరేళ్ల రోషిణి, రెండేళ్ల పావని, రెండు నెలల సారిక అక్కడికక్కడే మృతిచెందారు. మరో చిన్నారి గీతకు తీవ్రగాయాలయ్యాయి.
ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో మీఠలాల్ దంపతులు... ఇంట్లోకి వెళ్లి చూసేసరికి చిన్నారులు విగతజీవుల్లా పడిఉన్నారు. ఈ విషాద ఘటనతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. పాత ఇళ్లు గోడ నిర్మాణం సరిగ్గా లేకపోవడంతోనే గోడ కూలినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.