3 seats in MLA Quota MLC elections are unanimous: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీలుగా ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థులు.. దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆర్‌వో నుంచి ఈ ముగ్గురు అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఈ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది.
మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారిని అభినందించారు. అనంతరం ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్జతలు తెలిపారు. కొత్త ఎమ్మెల్సీలను సీఎం ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్ర శాసన మండలి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు సీఎం కేసీఆర్ తమ అభ్యర్థులను ప్రకటించారు.
దీంతో అభ్యర్థులుగా చల్లా వెంకట్రామిరెడ్డి, దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్‌లను సీఎం ఖరారు చేశారు. ఈ మేరకు వారిని ఈ నెల 9న నామినేషన్ వేయాల్సిందిగా కేసీఆర్ సూచించిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన ఏర్పాట్లను చూసుకోవాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
MLA Kota MLC Election Schedule: ఫిబ్రవరి 27న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన విషయం విధితమే. మార్చ్ 29వ తేదీతో తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. తెలంగాణ 3 స్థానాలు, ఏపీలో 7 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అయితే రాష్ట్రంలో నవీన్ కుమార్, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. ఈ క్రమంలోనే శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల అయింది.
ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు పరిశీలిస్తే: ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నవీన్ కుమార్‌కు సీఎం కేసీఆర్ మరోసారి అవకాశాన్ని ఇచ్చారు. గతంలో టీచర్‌గా చేసి.. ఉద్యమంలో చురుగ్గా వ్యవహారించి ప్రస్తుతం సీఎం కార్యాలయం ఓఎస్‌డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్‌కు కేసీఆర్ హామీ ఇచ్చారు. చాలా కాలంగా దేశపతికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని భావించినప్పటికీ.. పలు కారణాలతో గతంలో అవకాశం ఇవ్వలేదు.
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు(కూతురి కొడుకు), చల్లా వెంకట్రామిరెడ్డి ఇటీవలే బీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ విస్తరణలో చల్లా వెంకట్రామిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు భిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్.. తదితర పేర్లు కూడా ప్రచారం జరిగినప్పటికీ.. వారికి ఈ అవకాశం దక్కలేదు.
ఇవీ చదవండి: