Farmers Died: రైతుపై కరోనా దెబ్బ... 75 వేల మంది కన్నుమూత - Corona farmers died
Farmers Died: తెలంగాణలో కరోనా మహమ్మారి సోకడం మొదలయ్యాక రైతుల మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మూడున్నరేళ్లలో 75,014 మంది కన్నుమూయగా వారిలో 29,120 మంది 2020-21లోనే చనిపోయారు.
Farmers
By
Published : Jan 11, 2022, 5:10 AM IST
Farmers Died: రాష్ట్రంలో కొవిడ్ విపత్తు మొదలయ్యాక రైతుల మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మూడున్నరేళ్లలో 75,014 మంది కన్నుమూయగా వారిలో 29,120 మంది 2020-21లోనే చనిపోయారు. కొవిడ్ విజృంభించిన 2020 ఆగస్టు 14 నుంచి 2021 ఆగస్టు 13నాటికి 29,120 మంది సహజ మరణం పొందినట్లు వ్యవసాయశాఖ రికార్డుల్లో నమోదైంది.
వీరంతా 18-59 ఏళ్లలోపువారు. అంతకన్నా ఎక్కువవయసున్న వారి మరణాలూ లెక్కిస్తే ఈ సంఖ్య పెరుగుతుంది. 2019-20లో 19,115 మంది కన్నుమూస్తే కొవిడ్ వ్యాప్తి చెందిన 2020-21లో 52.34 శాతం(10,005 మంది) అదనంగా ప్రాణాలొదిలారు. దీన్నిబట్టే రైతులపై కరోనా తీవ్రప్రభావం చూపినట్లు వెల్లడవుతోంది.
రైతు బీమాతో లెక్కలన్నీ పక్కా..
రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకం ఉన్న 18-59 ఏళ్లలోపు వారికి వ్యవసాయశాఖ రైతుబీమా అమలు చేస్తోంది. రాష్ట్రంలో 2021 ఆగస్టు 14 నుంచి 2022 ఆగస్టు 13నాటికి 35.64 లక్షల మంది తరఫున రూ.4110.11 కోట్లను ఎల్‌ఐసీకి ప్రీమియంగా చెల్లిస్తోంది. ఈ జాబితాలో పేరు నమోదైన రైతు ఏకారణంతో మరణించినా అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది.
2018 ఆగస్టు 14న ఈ పథకం మొదలైనప్పటి నుంచి మూడున్నరేళ్లలో మొత్తం 75,014 మంది రైతులు చనిపోయినట్లు వ్యవసాయశాఖ ఎల్‌ఐసీకి సమాచారం ఇచ్చింది. వీరిలో 71,690 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.3,584.50 కోట్లను పరిహారంగా ఎల్‌ఐసీ అందజేసింది. గతేడాది కరోనా నేపథ్యంలో రైతుల మరణాలు అమాంతం 52 శాతం పెరగడంతో వారి కుటుంబాలకు చెల్లించే పరిహారం అంతకుముందు ఇచ్చిన రూ.947 కోట్లతో పోలిస్తే రూ.1421.20 కోట్లకు పెరిగింది.
మరణాలు పెరగడంతో ప్రీమియం పెంపు
*రైతుల సంఖ్య, మరణాల ఆధారంగా వారి తరఫున చెల్లించాల్సిన ప్రీమియంను సైతం ఎల్‌ఐసీ ఏటా పెంచుతూ వస్తోంది. 2019-20కి 30.73 లక్షల మంది రైతుల తరఫున రూ.902.86 కోట్లను ప్రీమియంగా వ్యవసాయశాఖ చెల్లించింది. ఈ ఏడాది 19,115 మరణాలు నమోదవ్వడంతో వారి కుటుంబాలకు చెల్లించిన పరిహారం కూడా రూ.947.75 కోట్లే ఉంది. *2020-21లో అన్నదాతల సంఖ్య 32.73 లక్షలున్నా వారి తరఫున ప్రీమియంను పెద్దగా పెంచకుండా రూ.967.17 కోట్లనే ఎల్‌ఐసీ తీసుకుంది. 2020-21లో కొవిడ్ కాలంలో మరణాలు 52 శాతం పెరగడంతో బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తం రూ.1412.20 కోట్లకు చేరింది. దీంతో ఈ ఏడాది 2022-23లో ప్రీమియంను రూ.1465 కోట్లకు పెంచేసింది. *ఇక 2021 ఆగస్టు 14 నుంచి ఇప్పటి వరకు 9022 మంది మరణించగా వారిలో 6667 కుటుంబాలకు ఇప్పటికే రూ.333.35 కోట్లు చెల్లించారు. మిగతా వారికి చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతోంది.