తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కుంభవృష్టితో వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు - telangana rains news

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటలు పూర్తిగా నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతన్నలు వేడుకుంటున్నారు.

రాష్ట్రంలో కుంభవృష్టితో వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు
రాష్ట్రంలో కుంభవృష్టితో వేలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు

By

Published : Jul 24, 2021, 4:41 AM IST

కుంభవృష్టి వర్షాలతో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంటలు పూర్తిగా మునిగాయి. పలు ప్రాంతాల్లో కొద్ది గంటల్లోనే అతి భారీ వర్షాలు పడటం వల్ల మొలక, చిన్న మొక్కల దశలో ఉన్న పంటలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలంలో గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకూ రికార్డు స్థాయిలో 39, ఆసిఫాబాద్‌లో 30, నిర్మల్‌ జిల్లా సారంగాపూర్‌లో 21, లక్ష్మణచాందాలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం 24 గంటల్లో 20 సెం.మీ.లకు పైగా వర్షం కురిస్తే అత్యంత భారీ వర్షంగా పరిగణిస్తారు. ఈ స్థాయి వర్షాలతో అప్పటికప్పుడు వచ్చే వరదలకు మొక్కల స్థాయిలో ఉండే పైర్లు నిలబడలేవని, వర్షపు నీటిలో మునిగితే దెబ్బతింటాయని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపుతోటల్లో నీరు నిలవడంతో పాడయ్యాయి. వరి, పత్తి, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలకు నష్టం ఎక్కువగా ఉంది.

పైరులో 33 శాతానికిపైగా దెబ్బతిందని గుర్తిస్తే..

వరదలు, తుపాన్లు, కరవు వంటి విపత్తులతో పంటలు దెబ్బతింటే వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో విచారించి అంచనాలు రూపొందించాలి. ప్రతీ రైతు వివరాలు నమోదు చేయాలి. పైరులో 33 శాతానికిపైగా దెబ్బతింటే నష్టంగా పరిగణించి కేంద్రానికి నివేదిక పంపాలి. ఆ నష్టాలను కేంద్రం గుర్తిస్తే ఎకరానికి రూ.10 వేల దాకా పెట్టుబడి రాయితీ వస్తుంది. కానీ రాష్ట్రంలో వ్యవసాయశాఖ లెక్కలు సేకరించడం లేదు. ఎన్ని ఎకరాల్లో పంటలు నీట మునిగాయి, ఎందరు రైతులు ఎంత నష్టపోయారనే వివరాలను అడిగితే వ్యవసాయశాఖ కార్యదర్శి, కమిషనర్‌ రఘునందన్‌రావు సమాధానం ఇవ్వలేదు. పంట నష్టాలను లెక్కించాలని కమిషనర్‌ కార్యాలయం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున తాము పొలాలకు వెళ్లి చూడటం లేదని ఓ జిల్లా వ్యవసాయాధికారి ‘ఈనాడు’కు చెప్పారు. కొన్ని జిల్లాల్లో వ్యవసాయాధికారులతో మాట్లాడితే ప్రాథమిక అంచనా అంటూ మౌఖికంగా చెబుతున్నారు. ఈ మౌఖిక లెక్కల వల్ల రైతులకు పరిహారంగా కేంద్రం నుంచి పెట్టుబడి రాయితీ ఏమీ రాదు. అది రావాలంటే ఒక రైతు ఎన్ని ఎకరాల్లో.. ఏ సర్వే నంబర్లో.. ఎంత పంట వేశారు... అందులో ఎంత శాతం దెబ్బతింది అనేది వివరంగా ఉండాలి. ఆధార్‌నంబరు, బ్యాంకు ఖాతాతో సహా సమగ్రంగా సేకరించాలి. ఇలాంటి వివరాలు సేకరించాలని ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ నష్టం..
* కుమురం భీం జిల్లాలో దాదాపు 43,600 ఎకరాల పంటలు దెబ్బతిన్నట్లు అంచనా.
*జగిత్యాల జిల్లాలోని రాయికల్‌, కోరుట్ల, మల్లాపూర్‌, జగిత్యాల, సారంగాపూర్‌, కథలాపూర్‌, బీర్పూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 64 గ్రామాల్లో 1,639 మంది రైతులకు చెందిన 2,791 ఎకరాల్లో పంటలు నీట మునినట్లు జిల్లా అధికారులు తెలిపారు. వీటిలో 1,883 ఎకరాల వరి ఉంది. ఈ పంటలన్నీ 33 శాతానికి పైగా దెబ్బతిన్నట్లు గుర్తించారు.
* ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో 50 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది.
* సిద్దిపేట జిల్లాలో 140 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు స్థానిక అధికారులు చెప్పారు.\

నీటిని బయటకు పంపాలి..

రాష్ట్రంలో ఈ నెల 1 నుంచి 23 వరకూ సాధారణంకన్నా 86 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు ఆచార్య జయశంకర్‌ వర్సిటీ తెలిపింది. ‘‘పంటచేలలో నిలిచిన నీటిని వెంటనే బయటకు వెళ్లేలా రైతులు చర్యలు తీసుకోవాలి. వరికి యూరియా వంటి నత్రజని ఎరువు వేయడం మానేయాలి. పత్తికి వడలు తెగులు సోకే ప్రమాదముంది. అది కనిపిస్తే వెంటనే లీటరు నీటిలో 3 గ్రామలు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ అనే మందును కలిపి మొక్క మొదలు చుట్టూ నేలపై చల్లాలి. ఆకుమచ్చ తెగులు, రసం పీల్చే పురుగులు కనిపిస్తే లీటరు నీటిలో 1.5 గ్రాముల ఎసిఫేట్‌, ఒక గ్రాము కార్బెండిజం కలిపి చల్లాలి’’ అని సూచించింది..

ఈ ఫొటోలో కనిపిస్తున్న పొలం కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలం కమాన గ్రామంలో ఎల్‌.శ్యాంరావు అనే రైతుది. ఈయన 4 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశారు. ఎకరానికి రూ.15 వేల చొప్పున రూ.60 వేలు కౌలు ముందే చెల్లించారు. ఇప్పటికే రూ.40 వేల దాకా పెట్టుబడి పెట్టారు. వాంకిడిలో కురిసిన కుంభవృష్టితో పత్తి పైరు మొత్తం నీట మునిగి పాడైంది. పెట్టుబడి మొత్తం వర్షాలతో నష్టపోయానని శ్యాంరావు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..

నేను 2 ఎకరాల్లో పత్తి సాగుచేశా. గత రెండు నెలల్లో రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టా. వర్షాలకు నీటమునిగి పంట దెబ్బతింది. వర్షాలు కొనసాగితే పంట ఏమీ మిగిలే పరిస్థితి లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- జగన్నాథుల రమేశ్‌, పత్తి రైతు, నడికుడ, వరంగల్‌ జిల్లా

పూర్తిగా కొట్టుకుపోయిన వరిపైరు..

ఈ వానాకాలంలో 4 ఎకరాల్లో వరి నాట్లు వేశా. ఇప్పటికే రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టా. 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరదనీరు పారి వరిపైరు మొత్తం కొట్టుకుపోయింది. పైరు ఏమాత్రం మిగలలేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి.

- తాటి అంజన్న, వరి రైతు, కమ్మునూరు, జగిత్యాల జిల్లా

మొలకెత్తిన నిర్లక్ష్యం..

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ప్రభుత్వం క్వింటా రూ.1,888 చెల్లించి కొంది. ధాన్యాన్ని మిల్లర్లకు పంపగా వారు బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇవ్వాలి. ఈ క్రమంలో వనపర్తి జిల్లా పెద్దమందడిలోని ఓ రైస్‌మిల్లులో నిల్వ చేసిన ధాన్యాన్ని భద్రపరచడంలో జరిగిన నిర్లక్ష్యంతో ఇటీవల కురిసిన వర్షానికి దాదాపు 5,000 బస్తాలకు పైగా ధాన్యం మొలకెత్తింది. జిల్లా పౌరసరఫరాల అధికారి రేవతి స్పందిస్తూ.. ‘మిల్లరుదే బాధ్యత. ఎంత నష్టం జరిగిందో అంతమేరకు ఆ మిల్లరు నుంచే రాబడతాం’ అన్నారు.

ఇదీ చూడండి: Telangana projects inflow: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

ABOUT THE AUTHOR

...view details