Bathukamma Sarees: ఈసారి 289 వర్ణాల్లో బతుకమ్మ చీరలు... అక్టోబరు 2 నుంచి పంపిణీ!
వచ్చే నెలలో జరగనున్న బతుకమ్మ పండుగ (Bathukamma Festival)ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. వచ్చే నెల రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
బతుకమ్మ చీరలు
By
Published : Sep 29, 2021, 4:51 AM IST
|
Updated : Sep 30, 2021, 5:45 PM IST
తెలంగాణలో వచ్చే నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగ (Bathukamma Festival)ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు మంగళవారానికి అన్ని జిల్లాలకు చేరాయి. సిరిసిల్లలో తయారు చేసిన కోటి చీరలను రెండో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. 31 జిల్లాల్లో స్పష్టత వచ్చినా.. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక దృష్ట్యా కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో పంపిణీపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల సంఘాన్ని సంప్రదించిన అనంతరం ఈ రెండు జిల్లాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏటా రూ.300 కోట్లతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది రూ.318 కోట్లను వెచ్చించింది.
సరికొత్తగా...
దాదాపు 16 వేల మగ్గాలపై పది వేల నేత కుటుంబాలు ఆరు నెలల పాటు శ్రమించి చీరలను తయారు చేశాయి. గతేడాది పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ సారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లతో కలిపి మొత్తం 289 వర్ణాలలో రూపొందించారు. డాబీ అంచు ఈ సారి మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. చీరల ప్యాకింగునూ ఆకర్షణీయంగా చేశారు.
పంపిణీ ఇలా..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పురపాలక వార్డులు, నగరపాలక డివిజన్ల వారీగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో రేషన్ డీలర్, పంచాయతీ కార్యదర్శి, మహిళా సంఘం ప్రతినిధులతో కూడిన కమిటీ.. పట్టణాలు, నగరాల్లో రేషన్ డీలర్, పురపాలిక బిల్ కలెక్టర్, మహిళా సంఘం ప్రతినిధుల కమిటీ ఆధ్వర్యంలో పంపిణీ జరుగుతుంది. ఆహార భద్రత కార్డులతో వచ్చి లబ్ధిదారులు చీరలు పొందవచ్చు. ఈ సందర్భంగా సామాజిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరని.. కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టంచేసింది.