భక్తుల పాలిట కొంగు బంగారమైన బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట (Balapur Ganesh Laddu Auction)కు ఉత్సవ సమితి సర్వం సిద్ధం చేస్తోంది. గతేడాది కరోనా కారణంగా విఘ్నాలు రావడంతో వేలంపాటను రద్దు చేసిన ఉత్సవ సమితి... ఈ ఏడాది మరింత జోరుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. లడ్డూ వేలంపాటలో 26 ఏళ్లుగా ప్రత్యేకతను సంతరించుకున్న బాలాపూర్ గణేశుడు... తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలమూలల ఉన్న తెలుగువారిలో ఆసక్తిని రేకెత్తిస్తుంటాడు.
రూ.450 మొదలై...
1994లో 450 రూపాయలతో మొదలైన బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) లడ్డూ వేలం పాట... రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందలు, వేలు దాటి రికార్డు స్థాయిలో లక్షల పలుకుతోంది. సుమారు 20 మంది స్థానికులు, స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలంపాట నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుంటుంది. లడ్డూను దక్కించుకునేందుకు పడే పోటీ రసవత్తరంగా సాగుతుంటుంది. ఈ పోటీలో కొన్నిసార్లు స్థానిక రైతులు లడ్డూను దక్కించుకోగా మరికొన్నిసార్లు స్థానికేతరులు అదృష్టాన్ని పొందారు. 2016లో బాలాపూర్ లడ్డూను మేడ్చల్‌కు చెందిన స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేల రూపాయలకు సొంతం చేసుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి రూ.15 లక్షల 60 వేలకు లడ్డూ పొందగా... 2018లోనూ స్థానికేతరుడు తేరేటి శ్రీనివాస్ గుప్తా రూ.16 లక్షల 60 వేలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు.
కరోనా వల్ల...
వరుసగా మూడేళ్లు స్థానికేతరులనే బాలాపూర్ గణేశుడు కరుణించాడు. 2019లో జరిగిన వేలంపాటలో అవకాశం స్థానికులకు దక్కింది. కొలను రాంరెడ్డి రూ.17 లక్షల 60 వేలు పాడి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ఇలా... 26 ఏళ్లుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా సంప్రదాయంగా సాగిన లడ్డూ వేలంపాటకు 2020లో కరోనా మహామ్మారి అడ్డుపడింది. నిరాడంబరంగానే ఉత్సవాలను జరిపిన కమిటీ సభ్యులు... భక్తుల ఆరోగ్యం దృష్ట్యా వేలంపాటను రద్దు చేశారు. ఉత్సవ సమితి నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లడ్డూను అందజేశారు.
చివరిపూజ తర్వాత వేలం...