జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో మొత్తంమీద భౌతికశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని.. గణితం మధ్యస్తంగా ఉన్నాయని నిపుణులు, విద్యార్థులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్‌డ్ పేపర్-1కు 1,51,311 మంది, పేపర్-2కు 1,50,900 మంది హాజరయ్యారు. రెండు పేపర్లు రాస్తేనే హాజరైనట్లుగా పరిగణిస్తారు. అంటే 1,50,900 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు పరిగణిస్తారు. మొత్తం 96 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించిన ఐఐటీ దిల్లీ తెలిపింది. మొత్తం 222 నగరాలు/పట్టణాల్లో 1001 పరీక్ష కేంద్రాల్లో విజయవంతంగా పరీక్ష జరిగిందని ఐఐటీ దిల్లీ సంచాలకుడు ఆచార్య వి.రాంగోపాల్‌రావు తెలిపారు.
ఒక్కో పేపర్ 198 మార్కులకు...
ఒక్కో పేపర్‌లో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలలో ఒక్కో సబ్జెక్టుకు 18 చొప్పున మొత్తం 54 ప్రశ్నలు ఇచ్చారు. ఒక్కో సబ్జెక్టుకు 66 మార్కుల చొప్పున, మూడు సెక్షన్లకు కలిపి 198 మార్కులు. అంటే రెండు పేపర్లు కలిపి మొత్తం 396 మార్కులు. జనరల్ కేటగిరీకి 35 శాతం అంటే 139 మార్కులు కటాఫ్ ఉండొచ్చని నిపుణుల అంచనా. ఓబీసీలకు 30 శాతం, ఎస్‌సీలకు 15 శాతం ఉంటుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొందరు విద్యార్థులకు 360 మార్కులు దాటవచ్చని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. 300 మార్కులు దాటిన వారికి 100లోపు ర్యాంకు వస్తుందని అంచనా వేస్తున్నారు.