భారత్ -ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా... ఈనెల 25న జరగనున్న టీ-ట్వంటీ మ్యాచ్ టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా రావడంతో... సికింద్రాబాద్ జింఖానా మైదానం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టిక్కెట్ల కోసం నాలుగైదు రోజుల నుంచే...తెలుగురాష్ట్రాల నుంచి క్రీడాభిమానులు పోటెత్తుతున్నారు. హెచ్‌సీఏ టిక్కెట్లను బ్లాక్ అమ్ముతోందంటూ.... ఆందోళనల చేపట్టారు. ఓ న్యాయవాది ఏకంగా హెచ్‌ఆర్సీలో పిటిషన్ వేశారు. ఈ తరుణంలో మేల్కొన్న హెచ్‌సీఏ యంత్రాంగం ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఇస్తామని ప్రకటించడంతో... క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. చాలామంది వస్తారనే అంచనాలున్నప్పటికీ...సరైన ఏర్పాట్లు చేయలేదు. మెయిన్ గేట్ ద్వారా ఒక్కసారిగా అభిమాన సందోహం తోసుకొచ్చారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తోపులాటలో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు.
బీసీసీఐ, హెచ్‌సీఏ మధ్య సమన్వయం లోపం అడుగడుగునా కనిపిస్తోంది. ముందస్తు సన్నద్ధత లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడంలోనూ హెచ్‌సీఏ వెనకపడిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు సాంకేతిక సమస్యతో ఆన్‌లైన్ చెల్లింపులకు అంతరాయం కలిగింది. నగదు తీసుకుని సిబ్బంది టికెట్లు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్ వ్యవస్థను సరిగా వినియోగించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజకీయ కారణాలు, కొవిడ్ మహమ్మారి వల్ల మూడేళ్లుగా హైదరాబాద్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లు కేటాయించడం లేదు. అజహరుద్దీన్‌కు కొందరు పాలకమండలి సభ్యులు సహాయ నిరాకరణ చేపట్టడం తాజా వైఫల్యానికి కారణంగా విశ్లేషిస్తున్నారు.హెచ్‌సీఏలో వర్గపోరు, ఆధిపత్య చలాయించాలనే తపన తప్ప నిర్వహణ గాలికొదిలేశారు. అంతిమంగా ఆటను ప్రత్యక్షంగా వీక్షించి ఆస్వాదించడానికి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన అభిమానులు తీవ్రంగా నిరాశచెందతున్నారు. టికెట్ల కోసం మూడు,నాలుగు రోజులుగా నిరీక్షిస్తున్నామని వాపోయారు.