political leaders support for realtors : రాజకీయ ఒత్తిడితో అక్రమ నిర్మాణాల గుర్తింపు వ్యవహారం పక్కదారి పడుతోంది. కొందరు ప్రజాప్రతినిధుల అండతో సాగుతున్న అక్రమ నిర్మాణాలను జాబితాలో చూపకుండా మాయాజాలం చోటు చేసుకుంటోంది. హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే 29 పురపాలక సంఘాలు, ఏడు నగర పాలక సంస్థల పరిధిలో పంచాయతీల పేరుతో అక్రమ అనుమతుల నిర్మాణాలను ఈ నెలాఖరులోగా గుర్తించి నివేదికను పంపించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ కొద్ది రోజుల కిందట ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని పురపాలక సంఘాల, నగర పాలక సంస్థల కమిషనర్లు పూర్తి స్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. ఇది మొదలై రెండు రోజులు కాకముందే ప్రజాప్రతినిధులు ఫోన్లు చేసి ఫలానా వెంచర్లు జాబితాలో చూపించవద్దని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మంత్రి కేటీఆర్ స్పెషల్ ఫోకస్
illegal constructions in HMDA: హెచ్‌ఎండీఏ పరిధిలో ఇటీవల కాలంలో భారీ ఎత్తున అక్రమ నిర్మాణాలు మొదలయ్యాయి. రెండేళ్ల కిందటే పంచాయతీల నుంచి అనుమతులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు చూపించి బహుళ అంతస్తుల అపార్టుమెంట్లు, విల్లాలు వేల సంఖ్యలో నిర్మిస్తున్నారు. దుండిగల్ పురపాలిక పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలను ‘ఈనాడు-ఈటీవీ భారత్’ వెలుగులోకి తేవడంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కిందిస్థాయి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక ముందైనా నగరంతోపాటు చుట్టపక్కల పట్ణణాలన్నీ ప్రణాళికా బద్ధంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారా సమగ్ర అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో అధికారులకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై కేటీఆర్ దృష్టిసారించారు.