Education from Nawabs to Gharibs: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 15 దశాబ్దాల చరిత్ర ఆ పాఠశాల సొంతం. భాగ్యనగరంలోనే అత్యంత పురాతమైన విద్యాలయాల్లో ఒకటిగా పేరొందింది. నవాబుల పిల్లల నుంచి గరీబోళ్ల పిల్లల వరకు.. వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పింది. అదే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ అలియా పాఠశాల, జూనియర్ కళాశాల.
మొదలైందిలా..:సర్ సాలార్‌జంగ్-1 తన కుమారులతోపాటు హైదరాబాద్‌లోని ప్రముఖుల పిల్లలకు ఆంగ్ల విద్యను అందించేందుకు మదర్సా-ఐ-అలియా పేరిట 1872లో ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. తొలుత పురానీహవేలిలో ఏర్పాటు కాగా తర్వాత కింగ్‌కోఠికి మార్చారు. 1881లో చాదర్‌ఘాట్ కళాశాలను అలియా పాఠశాలతో విలీనం చేసి నిజాం కళాశాలను ఏర్పాటు చేశారు. 1887-1947 వరకు ఇక్కడే పాఠశాల కొనసాగింది. 1949లో నిజాం హోం సెక్రటేరియట్‌గా ఉన్న ప్రస్తుత గన్‌ఫౌండ్రిలోని ఆవరణకు స్కూలును తరలించారు. 1974లో విద్యాశాఖకు అప్పగించి బోర్డు డైరెక్టర్లను నియమించారు.
ఎంతో మంది ప్రముఖులు: ఏడో నిజాం రాజు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్, ఎనిమిదో నిజాం రాజు ముకరంజా, మహరాజా కిషన్‌ప్రసాద్, మాజీ గవర్నర్లు అలీయార్ జంగ్, మెహదీ నవాజ్ జంగ్, క్రికెటర్లు అబ్బాస్ అలీ బేగ్, గులాం అహ్మద్, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆసిఫ్ ఇక్బాల్, విశ్రాంత ఐఏఎస్ అధికారి మహ్మద్ అలీ రఫత్, విశ్రాంత డీఐజీ సయ్యద్ సిరాజుద్దీన్, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబుఖాన్ తదితరులు ఇక్కడే చదివారు.