తెలంగాణ

telangana

ETV Bharat / state

తగ్గింది... కానీ... ఏమరుపాటుగా ఉంటే ప్రమాదమే!!

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. గరిష్ఠంగా 23 శాతం వరకూ వెళ్లిన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 2.57 శాతానికి పరిమితమయ్యాయి. కేసులు తగ్గిన నేపథ్యంలో ఆసుపత్రుల్లో కొవిడ్‌ పడకలు చాలావరకూ ఖాళీ అయ్యాయి. కానీ ప్రజలు ఏమరుపాటుగా ఉంటే.. మళ్లీ కొవిడ్‌ విజృంభించే ప్రమాదం ఉందని ప్రజారోగ్యశాఖ హెచ్చరిస్తోంది.

corona
తగ్గింది... కానీ... ఏమరుపాటుగా ఉంటే ప్రమాదమే!!

By

Published : Dec 3, 2020, 6:45 AM IST

రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ... ఏమరుపాటుగా ఉంటే రెండో దశ ఉద్ధృతి తప్పదని ప్రజారోగ్యశాఖ వెల్లడించింది. ‘మన దగ్గర కొవిడ్‌ రెండో ఉద్ధృతి రాదని అనుకోవడానికి వీల్లేదు. ఇటీవల జగిత్యాలలో ఒక పెళ్లికి జనం పెద్ద సంఖ్యలో హాజరవడం వల్ల అక్కడ వైరస్‌ వ్యాప్తి చెంది, ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది’ అని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

మరో నాలుగు వారాల పాటు ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తొలిదశ టీకాకు జాబితాను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. టీకాతో సుమారు 9 నుంచి 12 మాసాల వరకూ రక్షణ ఉంటుందని తెలిపారు. ఆయన, వైద్య విద్య సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి కొవిడ్‌ తగ్గుముఖం పట్టిన తీరును బుధవారం విలేకరులకు వివరించారు. ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. స్వీయ జాగ్రత్తలతోనే కరోనా వైరస్‌ రెండో ఉద్ధృతిని అడ్డుకోవడం సాధ్యమవుతుందని, ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా చికిత్సానంతరం సమస్యలు

రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వరకూ ఆక్సిజన్‌ సిలిండర్లు సరఫరా చేశామని, ప్రస్తుతం 1,600 వెంటిలేటర్లున్నాయని డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. ‘కరోనా సోకినవారిలో ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. చికిత్సానంతరం రెండు నెలల తర్వాత తిరిగి ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ తరహా సమస్యలు ఎదురైనవారు 3 నెలల నుంచి ఏడాది వరకూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. గాంధీ ఆసుపత్రిలో కొవిడేతర వైద్యసేవలను ప్రారంభించాం. త్వరలోనే అన్ని శస్త్రచికిత్సలనూ అందుబాటులోకి తెస్తాం. వైద్య కళాశాలలు ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నర్సుల ధర్నాలు పరిధి దాటితే చర్యలు తీసుకుంటాం. వారి వేతనాల చెల్లింపుల్లో జాప్యం లేదు. క్వారంటైన్‌ సెలవులు రద్దు చేయాల్సిందిగా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. అదే పాటిస్తున్నాం. కొవిడ్‌ టీకా వచ్చిన తర్వాత ముందుగా వైద్య సిబ్బందికే ఇస్తాం’ అని డీఎంఈ తెలిపారు.

  • రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ చికిత్సల కోసం కేటాయించిన మొత్తం 17,070 పడకల్లో శనివారం నాటికి 2,047(12 శాతం) పడకల్లో రోగులు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details