తెలంగాణ

telangana

ETV Bharat / state

బాటిళ్లలో రానున్న మిషన్​ భగీరథ నీళ్లు..! - బాటిళ్లలో మిషన్​ భగీరథ నీళ్లు వార్తలు హైదరాబాద్​

మిషన్ భగీరథ నీళ్లు ఇక బాటిళ్లలోనూ అందుబాటులోకి రానున్నాయి. దశలవారీగా బాటిళ్లను తీసుకొచ్చే దిశగా రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంతో పాటు పాలమూరు జిల్లాలోని కార్యాలయంలో వీటిని ఉపయోగిస్తున్నారు. తదుపరి దశల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో మిషన్ భగీరథ జలాలను బాటిళ్ల ద్వారా అందించాలన్న ఆలోచనలో ఉన్నారు.

బాటిళ్లలో రానున్న మిషన్​ భగీరథ నీళ్లు..!
బాటిళ్లలో రానున్న మిషన్​ భగీరథ నీళ్లు..!

By

Published : Nov 12, 2020, 5:24 AM IST

Updated : Nov 12, 2020, 7:05 AM IST

శుద్ధి చేసిన నదీజలాలను ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న పథకం మిషన్ భగీరథ. ఈ ప్రాజెక్టుపై రూ. 33 వేల 400 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుతం తెలంగాణలోని 23 వేల 287 ఆవాసాలకు సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తోంది. 124 పట్టణ ప్రాంతాలకు కూడా మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన జలాలను అందిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని చెంచుగూడేలు, లంబాడి తండాలకు కూడా సోలార్ పంపులు ఏర్పాటు చేసి సురక్షిత నీటిని సరఫరా చేస్తున్నారు. అందుకే కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం ఇంటింటికీ శుధ్ది చేస్తున్న జలాలను అందించడంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.

భగీరథ నీరు సురక్షితమన్న నివేదికలు..

మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న జలాలను పకడ్బందీగా శుద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జలాల శుద్ధి జరుగుతోంది. ఇందుకోసం నీటిశుద్ధికేంద్రాల వద్ద అత్యున్నత ప్రమాణాలతో కూడిన లేబరేటరీలతో పాటు నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందుకే మినరల్ వాటర్ కంటె మిషన్ భగీరథ నీరు సురక్షితమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంజినీర్లు, అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఆయా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. మిషన్ భగీరథ నీరు సురక్షితమని వివిధ సంస్థల నివేదికలు కూడా ఇప్పటికే స్పష్టం చేశాయి.

ప్రయోగాత్మకంగా నిర్వహణ..

వీటన్నింటి నేపథ్యంలో మిషన్ భగీరథ జలాలను బాటిళ్ల రూపంలోనూ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రయోగాత్మకంగా సొంత కార్యాలయాల్లోనే మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన జలాలను బాటిళ్లలో నింపి వినియోగించడాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం హైదరాబాద్​లోని మిషన్ భగీరథ కేంద్ర కార్యాలయంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కార్యాలయాల్లో వీటిని వినియోగిస్తున్నారు. మిషన్ భగీరథ నీటిశుద్ధి కేంద్రాల వద్ద శుద్ధి చేసిన జలాలను తీసుకొని బాటిళ్లను నింపుతున్నారు.

త్వరలో మార్కెట్​లోకి భగీరథ బాటిళ్లు..!

బుధవారం జరిగిన చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈల సమావేశంలో మిషన్ భగీరథ బాటిళ్లనే ఉపయోగించారు. ఈ ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అభినందించారు. ఇక నుంచి మిషన్ భగీరథ కార్యక్రమాలు, సమావేశాల్లో విధిగా ఈ బాటిళ్లనే ఉపయోగించాలని ఆదేశించారు. అటు దశల వారీగా మిషన్ భగీరథ బాటిళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. మొదటి దశలో అన్ని మిషన్ భగీరథ కార్యాలయాల్లో వీటిని ఉపయోగించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాతి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో మిషన్ భగీరథ బాటిళ్లను వినియోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకొని మార్కెట్లోకి కూడా మిషన్ భగీరథ బాటిళ్లను అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి.

ఇదీ చదవండి:నేడు కంప్యాక్టర్​ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్​

Last Updated : Nov 12, 2020, 7:05 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details