తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర రంగాల్లో ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రంగా పనిచేయడంతో పాటు తెలుగును ఆధునిక విజ్ఞాన, బోధన భాషగా అభివృద్ధి చేసేందుకు 1985 డిసెంబరు 2న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం పేరులో తెలుగు ఉన్నా భాషను బోధించే ఆచార్యులే కరవయ్యారు. ఒక్కొక్కరు ఉద్యోగ విరమణ చేయడంతో ఖాళీలు భర్తీ కాక బోధన కుంటుపడింది. చివరికి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించలేని పరిస్థితికి చేరుకుంది. వర్సిటీలో 82 మంది ఆచార్యులకుగాను కేవలం 14 మందే పనిచేస్తున్నారు.
ఐదు విభాగాల్లో సున్నా!
విశ్వవిద్యాలయంలో ఏళ్లుగా ఆచార్యుల నియామక ప్రక్రియ జరగలేదు. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్త వారిని నియమించక విభాగాలకు విభాగాలే ఖాళీ అయ్యాయి. ఐదు డిపార్టుమెంట్లలో ఒక్కరంటే ఒక్క ఆచార్యుడు కూడా లేరు. తెలుగు విభాగం పూర్తిగా మూతపడింది. ప్రతి విభాగంలో ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇద్దరు అసిసెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కొన్ని విభాగాలు ఒక్కరూ లేక మూతపడగా మరికొన్ని ఒకరిద్దరితోనే నెట్టుకొస్తున్నారు.
ఆచార్యులు లేక విభాగాల మూత
డిపార్టుమెంట్ ఆఫ్ తెలుగు, జ్యోతిషం, లాంగ్వేజ్ అండ్ ట్రాన్స్‌లేషన్స్ డిపార్టుమెంట్(ఇంగ్లీషు, సంస్కృతం), ఎన్‌సైక్లోపిడియా, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్, డిపార్టుమెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం. వీటితోపాటు ఫోక్ ఆర్ట్స్, జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లోఒక్కరే ఆచార్యులు ఉన్నారు. వీరు ఉద్యోగ విరమణ చేస్తే ఆ విభాగాలు మూతపడ్డట్లే.