మెట్రోరైళ్లు నడపాలా వద్దా అనేది కేంద్రం ఇంకా నిర్ణయించలేదు. దేశవ్యాప్తంగా ఈనెల 17 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలో దాదాపు అన్ని మెట్రోలు ప్రభుత్వాలే నిర్వహిస్తుంటే..గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం ప్రైవేటు సంస్థ నడుపుతోంది. కేంద్రం మార్గదర్శకాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పరిస్థితులనుబట్టి మెట్రోపై నిర్ణయం తీసుకోనుంది.
అభిప్రాయాల సేకరణ పూర్తి...
లాక్‌డౌన్ ముందు మెట్రోరైళ్లను నడిపినట్లు లాక్‌డౌన్ అనంతరం నడపడం కుదరదు. నిత్యం లక్షల మంది మెట్రోలో రాకపోకలు సాగించే అవకాశం ఉంది కాబట్టి కొవిడ్-19కి అవకాశం లేకుండా కొద్దినెలలపాటు ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరి. కేంద్రం అనుమతిస్తే ఎలా నడపాలనే దానిపై దేశంలోని వేర్వేరు మెట్రోరైలు ఎండీలు ఇప్పటికే రెండు దఫాలు దూరదృశ్య మాధ్యమం ద్వారా చర్చించారు. మరో దఫా చర్చించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ప్రజారవాణాకు సంబంధించి కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సీఆర్‌ఆర్‌ఐ) సోమవారం కొన్ని సూచనలు చేసింది. దిల్లీ మెట్రోరైలు సంస్థ భద్రతను చూసే సీఐఎస్‌ఎఫ్.. ప్రయాణికులకు, సిబ్బందికి కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. వేర్వేరు దేశాల్లో లాక్‌డౌన్ అనంతరం మెట్రోలను ఎలాంటి జాగ్రత్తలతో నడుపుతున్నారనే సమాచారాన్ని అధికారులు సేకరించారు.