Theme Parks in Hyderabad: ఆకాశ హర్మ్యాలు.. అందమైన భవంతులు.. విద్యుత్ కాంతులతో వెలిగిపోయే కార్పొరేట్ కార్యాలయాలకు నెలవు భాగ్యనగరం. కాంక్రీట్ జంగిల్‌లా మారిన హైదరాబాద్‌లో సేద తీరేందుకు, ఆరోగ్య స్పృహ కోసం నగరవాసులు ఉద్యానవనాల బాట పడుతున్నారు. కోటిమందికి పైగా జనాభా ఉన్న భాగ్యనగరంలో పరిమిత సంఖ్యలోనే పార్కులున్నాయి. ఆ లోటుని గమనించి సర్కార్.. పచ్చదనాన్ని పెంపొందించేందుకు విశేష కృషి చేస్తోంది. హరితహారం సహా అనేక కార్యక్రమాలను చేపట్టి లక్షలాది మొక్కలను నాటడంతో పాటు.. భారీగా పార్కులను అందుబాటులోకి తీసుకువస్తోంది.
నెమ్మదిగా సాగుతున్న పనులు : ఐదెకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 19 పార్కులు బల్దియా పరిధిలో ఉండగా.. 17 థీమ్ పార్కులు హెర్బల్, వెదురు థీమ్ పార్కులు, చిన్నా పెద్దా కాలనీల్లో కలిపి వెయ్యి వరకు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలను గుర్తించిన అధికారులు.. కబ్జాకు గురికాకుండా 1,833 ప్రాంతాల్లో పార్కులుగా తీర్చిదిద్దుతోంది. అందులో 83 చోట్ల కాలనీ, థీమ్ పార్కులుగా మార్చారు. జంట నగరాల్లో 132 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. చాలా చోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఎల్బీనగర్ జోన్‌లో 13 థీమ్ పార్క్‌లకుగాను ఒకటే పూర్తిచేశారు. ఖైరతాబాద్ జోన్‌లో 14 థీమ్ పార్క్‌లు చేపట్టగా ఒక్కటి మాత్రమే పూర్తి చేశారు. శేరిలింగంపల్లి జోన్ లో 10 పార్కులకు రెండు పార్కులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. కూకట్పల్లి జోన్, సికింద్రాబాద్ జోన్‌లోనూ ఒక్కటికి మించి పూర్తికాలేదు. రోడ్ల మధ్యన పూల మొక్కల పెంపుతో వాహన కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టారు.