Thefts in Hyderabad During Dussehra Festival :దసరా పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని చాలా కాలనీలు నిర్మాణుష్యంగా మారిపోతాయి. ఇదే అదునుగా భావించి అంతరాష్ట్ర, స్థానిక దొంగలు రెచ్చిపోతుంటారు. ఇప్పుడు దసరాకు తోడు.. ఎన్నికలుఉండటంతో పోలీసులు ఎలక్షన్ విధుల్లో బిజీగా ఉంటున్నారు. ఓవైపు నగర శివారు ప్రాంతాలు, తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ.. దొంగల ముఠాలు పడగవిప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో పండక్కి ఊరెళ్లవారు కాస్త జాగ్రత్త వహించాలి.
Police Caution Against Thefts In Festival Season : హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. పండక్కి ఊరెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇండ్లకు తాళం వేసి.. ఇంటి సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేయాలని చెప్పారు. మరోవైపు సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా తొమ్మిది వేలకు పైగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ దసరాను సాధారణ సమయాలతో పోల్చలేమంటూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు చోట్ల భారీ మొత్తంలో బంగారం చోరీ
పోలీసుల అంచనా ప్రకారం.. దిల్లీ, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. గత నెల రోజుల్లో నమోదైన దొంగతనాలు వాటిలో నిందితుల డేటా సేకరించి.. సీసీఎస్ బృందాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా నగరంవైపు కన్నెత్తి చూడని థార్, చెడ్డీ, పార్థీ గ్యాంగ్ తదితర కిరాతక ముఠాలు.. ఈ ఏడాది వేసవిలో వరుస చోరీలకు పాల్పడడం అలజడి రేపింది. మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్, అల్వాల్, బొల్లారం పోలీస్ స్టేషన్లలో పార్థీ గ్యాంగ్ సభ్యుడు, రాచకొండ పరిధిలోని మేడిపల్లిలో మహారాష్ట్రకు చెందిన థార్ ముఠా వరుస చోరీలకు పాల్పడింది. ఈ ముఠాలు ప్రస్తుత సమయాన్ని అవకాశంగా తీసుకునే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.