తెలంగాణ

telangana

ETV Bharat / state

THEATRES OPEN: తెలంగాణలో థియేటర్లు రీ-ఓపెన్​.. ఎప్పుడంటే..? - theatres re open in telangana from 8th of this monts

కరోనా కారణంగా కుదేలైన సినిమా థియేటర్ వ్యవస్థకు ఆసరాగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సినిమా థియేటర్ల విషయంలో.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. విద్యుత్, నిర్వహణ ఛార్జీల రద్దు, పార్కింగ్ ఫీజు వసూలు సహా మరిన్ని రాయితీలు కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయబోతుంది. ఈ క్రమంలోనే ఈ నెల 8 నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను పునఃప్రారంభించేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి.

తెలంగాణలో థియేటర్లు ఓపెన్​.. ఎప్పుడంటే..?
తెలంగాణలో థియేటర్లు ఓపెన్​.. ఎప్పుడంటే..?

By

Published : Jul 5, 2021, 6:00 PM IST

Updated : Jul 5, 2021, 6:12 PM IST

కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మొదటి దశతో పాటు రెండో దశలో కోట్లాది రూపాయల వ్యాపారం నష్టపోవడంతో పాటు థియేటర్ వ్యవస్థ దెబ్బతింది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, ఎఫ్​డీసీ ఎండీ అరవింద్ కుమార్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్​ను నిర్మాతలు దిల్​రాజు, సురేశ్​బాబు, దామోదర ప్రసాద్​తో పాటు పలువురు థియేటర్ యజమానులు కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు చర్చించారు.

సీఎస్​ సోమేశ్​కుమార్​ను కలిసిన పలువురు నిర్మాతలు

గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. రూ.10 కోట్లలోపు నిర్మించే సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్​మెంట్​తో పాటు థియేటర్​లో ప్రదర్శనల సంఖ్య పెంపు, సినిమా టికెట్ ధరల్లో సవరణలు, పార్కింగ్ ఫీజు వసూలు, కనీస విద్యుత్ ఛార్జీల రద్దుపై చర్చించారు. నిర్మాతల మండలి వినతిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసి.. సినీ పరిశ్రమకు ఊరట కల్పించాలని భావిస్తోంది.

8 నుంచి థియేటర్లు ఓపెన్​..

మరోవైపు గత రెండున్నర నెలలుగా మూతపడిన సినిమా థియేటర్లను ఈ నెల 8 నుంచి పునఃప్రారంభించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50 శాతం సీట్ల సామర్థ్యంలో థియేటర్ల పునఃప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో తెలంగాణలోనూ థియేటర్లను తెరవాలని ప్రాథమికంగా నిర్ణయించిన యాజమాన్యాలు.. రాష్ట్రంలో 100 శాతం సీట్ల సామర్థ్యంతో ప్రదర్శనలను కొనసాగించనున్నాయి.

రెండు వారాల తర్వాతే కొత్త సినిమాలు..

అయితే కొత్త సినిమాల విడుదలపై నిర్మాతలు పునరాలోచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలకు ఓటీటీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. పైగా గతంలోనూ వకీల్​సాబ్ విడుదల చేసినా.. నిర్మాతలు ఆశించిన స్థాయిలో లాభాలు పొందలేకపోయారు. సినిమా విడుదలైన నాలుగు రోజులకే కరోనా రెండోదశ ముప్పు రావడంతో థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా నిర్మాతలకు నిరాశ ఎదురైంది. ఇప్పుడు మూడో ముప్పు రాబోతుందన్న ఊహాగానాలు నిర్మాతలను మళ్లీ ఆలోచనలో పడేశాయి. థియేటర్లు తెరిచినా.. రెండు వారాల తర్వాతే కొత్త సినిమాల విడుదల తేదీలను ప్రకటించాలని భావిస్తున్నారు.

ఆత్రుతగా అభిమానులు..

మరోవైపు రెండోదశ కొవిడ్​తో థియేటర్లలో సినిమాను మిస్సవుతున్న అభిమానులు మాత్రం.. ఎప్పుడెప్పుడు తెరపై తమ అభిమాన హీరో సినిమా చూసేద్దామా అని ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా వెండితెరపై బొమ్మ పడకపోవడంతో కొత్త సినిమాల రిలీజ్​ కోసం ఆత్రుతగా ఉన్నారు.

ఇదీ చూడండి: THEATRES NEWS: ఏపీలో థియేటర్లు ఓపెన్..

Last Updated : Jul 5, 2021, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details