తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: మహిళల సాహసం.. కీచకుడి ఆట కట్టింపు - eve teaser arrest in visakha news

రక్షాబంధన్‌ రోజున ఇద్దరు మహిళలు చేసిన సాహసం... ఓ కీచకుడిని పట్టించింది. మెట్రోనగరంగా పేరుగాంచిన ఏపీలోని విశాఖలో ఒంటరిగా వెళ్లే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే యువకుడిని కటకటాలపాలు చేసింది. తమకు జరిగిన అవమానం వేరే వాళ్లకు జరగకూడదని భావించి.. ధైర్యంగా పోలీసులకు సహకరించిన మహిళలను నగర పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

ఏపీ: మహిళల సాహసం.. కీచకుడి ఆట కట్టింపు
ఏపీ: మహిళల సాహసం.. కీచకుడి ఆట కట్టింపు

By

Published : Aug 4, 2020, 5:49 PM IST

ఏపీ విశాఖ బీచ్ రోడ్డు, బస్‌స్టాండ్‌ ప్రాంగణాల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను వేధిస్తూ తప్పించుకు తిరుగుతున్న కీచకుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. అఫీషియల్‌ కాలనీకి చెందిన దుప్పాడ రాంబాబు అనే యువకుడు గత కొద్దిరోజులుగా ఒంటరిగా వెళ్లే మహిళలను వెంబడించి చుట్టూ ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నోసార్లు వేధించి తప్పించుకున్న నిందితుడిని... ఇద్దరు మహిళలు చేసిన సాహసంతో పోలీసులు పట్టుకున్నారు

సీసీ ఫుటేజీ ఆధారంగా..

గత నెల 24, 30 తేదీల్లో బీచ్‌రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న మహిళలతో రాంబాబు అసభ్యంగా ప్రవర్తించాడు. సమాజానికి, కుటుంబానికి భయపడి ఫిర్యాదు చేయకపోతే.. మరింత మందిని నిందితుడు వేధిస్తాడని భావించిన ఇద్దరు మహిళలూ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 30న జరిగిన ఘటనకు సంబంధించి 31న ఫిర్యాదు నమోదైంది.

కేసు నమోదు చేసిన పోలీసులు... పరిస్థితి తీవ్రత దృష్ట్యా దిశ పోలీసులకు దర్యాప్తు బాధ్యతను అప్పగించారు. నాలుగు బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు... సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులపై నిఘా ఉంచారు. తొలుత బైక్‌ నెంబర్‌ గుర్తించటంలో ఇబ్బంది పడ్డారు. మహిళలపై దాడి చేసే సమయంలో హెల్మెట్‌ పెట్టుకున్న నిందితుడు... బైక్‌ లైట్లను ఆన్‌చేసే ఉంచటంతో నెంబర్‌ప్లేట్‌ సరిగా కనిపించలేదు.

పూర్తి సహకారం..

ఇంతలోనే బాధిత మహిళలిద్దరూ పూర్తిగా సహకరిస్తామని ముందుకు రావడంతోపాటు... నిందితుడిని తామే పట్టుకుంటామని చెప్పటంతో పోలీసులు బీచ్‌రోడ్డులో గస్తీ పెంచారు. అనుమానాస్పదంగా హెల్మెట్‌ పెట్టుకుని తిరుగుతున్నవాళ్లని గుర్తించి వెంబడించి నిందితుడు రాంబాబును పట్టుకున్నారు.

ధైర్యంగా ముందుకొచ్చి నిందితుడిని పట్టించిన బాధిత మహిళలను .. నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా అభినందించారు. త్వరలోనే వారిని సత్కరిస్తామని ఏసీపీ ప్రేమ్‌ కాజల్‌ వెల్లడించారు. నిందితునిపై దిశ చట్టం కింద ఛార్జిషీట్‌ దాఖలు చేసి... సత్వరంగా శిక్ష పడేలా చేస్తామని ఆమె తెలిపారు.

మానసికంగా కుంగిపోకూడదు..

ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలు మానసికంగా కుంగిపోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ ప్రేమ్ కాజల్‌ పిలుపునిచ్చారు. బయటకు చెప్పలేకపోతే కనీసం వాట్సాప్‌లో అయినా ఫిర్యాదు చేయాలని సూచించారు. బీచ్‌రోడ్డులో గస్తీ పెంచామని, మహిళలపై ఏ రూపంలో దాడి చేసినా వెంటనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details