మహానగరం హైదరాబాద్‌లో అత్యధిక సీసీటీవి కెమెరాలు అమర్చిన నేపథ్యంలో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది. లండన్‌కు చెందిన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన 150 నగరాల్లో చేపట్టిన సర్వేలో ఇది వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా ముందు వరుసలోని 20 నగరాల జాబితాలో భారత్ నుంచి ఒక్క హైదరాబాద్‌కే స్థానం దక్కింది. 50 నగరాల జాబితాలో మాత్రం చెన్నై, దిల్లీకి చోటు లభించింది.
ప్రతి వెయ్యిమందిలో..
హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 30 కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం. కంపారిటెక్ సంస్థ అధ్యయనంలో జనాభాతో కెమెరాలను బేరీజు వేశారు. ప్రతి వెయ్యి మందికి ఎన్ని ఉన్నాయనే అంశం పరిశీలించారు. చైనాలోని తాయువాన్ నగరానికి తొలిస్థానం దక్కింది. షాంగ్జి ప్రావిన్స్ రాజధాని అయిన ఈ నగరంలో 4.65 లక్షలు ఉన్నట్లు తేలింది. అక్కడ 38.91 లక్షల జనాభాకు ఇన్ని కెమెరాలున్నాయి. దీన్ని ప్రతి వెయ్యి మందికి 119.57 కెమెరాలున్నట్టు తేలింది.
ఎన్ని ఉన్నాయంటే...
హైదరాబాద్‌లో సుమారు 3 లక్షల సీసీ కెమెరాలున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. జంట నగరాల్లో కోటికి పైగా జనాభా ఉన్నట్లు తేల్చగా... ప్రతి వెయ్యి మందికి 30 కెమెరాలు ఉన్నట్లు గుర్తించారు. మొదటి 50 నగరాల్లో 21వ స్థానంలో ఉన్న చెన్నైలో 1.09 కోట్ల జనాభాకుగాను 2.8 లక్షల కెమెరాలున్నట్టు వెల్లడైంది. అక్కడ ప్రతి వెయ్యి మందికి 25.52 కెమెరాలున్నట్టు గుర్తించారు. 33వ స్థానంలో ఉన్న దేశ రాజధాని దిల్లీలో 3.02 కోట్ల జనాభాకుగాను 14.18 సగటుతో 4.29 లక్షల కెమెరాలున్నట్టు తేలింది.