హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో నిర్వహిస్తున్న వింగ్స్ ఇండియా ఏవియేషన్- 2022 సదస్సులో రెండోరోజు పలు వ్యాపార ఒప్పందాలు జరిగాయి. పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా అధ్యక్షత జరిగిన సదస్సుకు.. ఏవియేషన్ షో లో భాగస్వాములైన 8 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం విమాన ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉందన్న కేంద్రమంత్రి సింధియా.. ఈనెల 27 నుంచి ప్రారంభమయ్యే అంతర్జాతీయ ప్రయాణాలతో పునర్‌వైభవం సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సదస్సులో పాల్గొన్నారు. సివిల్ ఏవియేషన్ రంగంలో మహిళా పైలెట్ల సంఖ్య విదేశాల కన్నా ఎక్కువ ఉండటం గర్వకారణమని గవర్నర్ తమిళిసై అన్నారు. ఏవియేషన్ ప్రదర్శనకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వటం గర్వకారణంగా ఉందన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి... హెలిప్యాడ్‌లను ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని కేంద్రాన్ని కోరారు. ఎయిరో స్పేస్ మానుఫ్యాక్చరింగ్‌కు హైదరాబాద్ హబ్‌గా ఎదుగుతోందని.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎంఆర్వో సెంటర్‌కు అదనంగా మరిన్ని ఎంఆర్వో సెంటర్లు పెంచాలని విజ్ఞప్తి చేశారు.