తెలంగాణ

telangana

ETV Bharat / state

అపార్ట్‌మెంటు వాసులకు జలమండలి షాక్ - water board latest news

అపార్ట్‌మెంటు వాసులకు జలమండలి ఝలక్‌ ఇచ్చింది. ఉచిత మంచినీటి పథకంలో అపార్ట్‌మెంట్లకు తాజాగా కొత్త నిబంధన చేర్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు అపార్ట్‌మెంట్‌లో ఏదైనా ఒక్క ఫ్లాటు యజమాని ఆధార్‌ను జలమండలి క్యాన్‌ (వినియోగదారుడి ఖాతా సంఖ్య)తో లింకు చేస్తే సరిపోయేది. దీంతో అదే అపార్ట్‌మెంట్‌లో మిగతా ఫ్లాట్లకూ ఉచిత నీటి పథకాన్ని వర్తింపజేయాలనుకున్నారు. తాజాగా ఈ నిబంధనను మార్చనున్నారు.

అపార్ట్‌మెంటు వాసులకు జలమండలి ఝలక్‌
అపార్ట్‌మెంటు వాసులకు జలమండలి ఝలక్‌

By

Published : Feb 23, 2021, 10:01 AM IST

కేంద్ర ప్రభుత్వ ఆధార్‌ మార్గదర్శకాలను అనుసరించి ప్రయోజనం పొందే ప్రతి లబ్ధిదారుడి ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి ఉండటంతో కొత్తగా మార్పులు తప్పడం లేదని అధికారులంటున్నారు. దీనిప్రకారం అపార్ట్‌మెంట్లలో ప్రతి ఫ్లాట్‌ యజమాని తన ఆధార్‌ లింకు చేసి వేలిముద్ర వేయాలి. దీంతో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు.. ఒక అపార్ట్‌మెంట్‌లో 100 ఫ్లాట్లు ఉన్నాయనుకుందాం.. అప్పుడు ప్రతి ఫ్లాటు యజమాని తన ఆధార్‌ను జలమండలి క్యాను నంబరుకు లింకు చేయాలి. అంతేకాక వేలిముద్ర కూడా వేయాలి. అప్పుడే సదరు అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్లకు ఉచిత నీరిస్తారు.

ఒకవేళ ఆ 100 ఫ్లాట్లలో వివిధ కారణాలతో 10 మంది అందుబాటులో లేకపోతే వారు తప్పనిసరిగా ప్రతినెలా బిల్లు చెల్లించాల్సిందే. ఇది ఇబ్బందికరమే. ఎందుకంటే ప్రతి అపార్ట్‌మెంటుకు ఏక మొత్తంలో (బల్క్‌గా) మంచినీటిని సరఫరా చేస్తుంటారు. వ్యక్తిగతంగా కాకుండా అన్ని ఇళ్లకు కలిపి ఒకటే నీటి బిల్లు ఇస్తారు. నిర్వహణ వ్యయం నుంచి నీటి బిల్లులను అసోషియేషన్‌ చెల్లిస్తుంది. ఈనేపథ్యంలో ఆ పది ఫ్లాట్ల నీటి బిల్లులు ఎవరు చెల్లిస్తారనేది సమాధానం లేని ప్రశ్న. నెలానెలా నిర్వహణ వ్యయం కడుతూ ఆధార్‌ లింకు కాలేదని అదనంగా నీటి బిల్లూ చెల్లించాలంటే సమస్యే. అయితే వందమంది యజమానులు ఒకేసారి వేలిముద్ర వేయడం, ఆధార్‌ లింకు చేయడం కుదరకపోతే ఎవరికి వీలైనప్పుడు లింకు చేసే అవకాశం ఉందా అనే కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో మరింత స్పష్టత రానుంది.

ప్రత్యేకంగా యాప్‌ రూపకల్పన..

గ్రేటర్‌లో దాదాపు 3 లక్షల అపార్ట్‌మెంట్లున్నాయని అంచనా. గేటెడ్‌ కమ్యూనిటీల్లో 500-1000 వరకు ఫ్లాట్లున్నాయి. 100-200 ఫ్లాట్లున్న అపార్ట్‌మెంట్లు ఎక్కువే. అయితే ఈ ప్రక్రియను సులువుగా చేసేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను జలమండలి రూపొందిస్తోంది. జలమండలి సర్వర్‌తో దీన్ని అనుసంధానిస్తారు. ఈ వెబ్‌ లింకు ద్వారా అపార్ట్‌మెంట్లలోనే ఎవరిదైనా ఒక కంప్యూటర్‌ నుంచి తమ ఆధార్‌తోపాటు వేలిముద్రను అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించాలని భావిస్తున్నారు. కొందరు యజమానులు విదేశాల్లో ఉండగా మరికొందరు వేర్వేరు ఊళ్లలో ఉంటున్నారు. ఆధార్‌ లింకుకు వీరంతా స్పందించకుంటే ఉచిత నీటిని పొందలేరు.

ఇప్పటివరకు 22 వేలు మాత్రమే..

ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటి ఉచిత పథకంలో లబ్ధి పొందాలంటే మురికివాడలు మినహా వ్యక్తిగత ఇళ్లల్లో పనిచేసే మీటరు తప్పనిసరిగా ఉండాలి. మార్చి 31లోపు లబ్ధిదారులు.. జలమండలి వెబ్‌సైట్‌, మీసేవా కేంద్రాల ద్వారా తమ ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలి. పథకాన్ని డిసెంబరు నుంచే అమలు చేస్తున్నా (53 రోజులు దాటినా) ఇంతవరకు 22 వేల మందే (10.08 లక్షల లబ్ధిదారుల్లో 2 శాతమే) లింకు చేసుకున్నారని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details