కరోనా నివారణ ఔషధ పరిశోధనల కోసం వైరస్‌ను సీసీఎంబీ ప్రయోగశాలలో వృద్ధి చేసేందుకు(వైరస్ కల్చర్) మార్గం సుగమమైంది. ఆఫ్రికన్ గ్రీన్ కోతుల కణాలను ఇందుకు ఇప్పటివరకు ఉపయోగిస్తుండగా.. ఇకపై మానవ ఊపిరితిత్తుల కణాలతో వాటిని పెంచేందుకు బాట ఏర్పడింది. ఈ మేరకు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), బెంగళూరుకు చెందిన ఐస్టెమ్ రీసెర్చ్ ప్రైవేటు సంస్థ జట్టుగట్టినట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపాయి.
మానవ ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియర్ కణాలతో కొవిడ్-19 వైరస్ జన్యువులు, రోగ లక్షణాలను అర్థం చేసుకోవడానికి, పరిశోధనశాలలో మందుల ప్రభావాన్ని హేతుబద్ధంగా పరీక్షించడానికి తాజా ఒప్పందం దోహదం చేయనుంది. కొవిడ్-19 మహమ్మారిపై పరిశోధనలు చేస్తున్న సీసీఎంబీ నిర్వీర్య టీకా తయారీ, వివిధ ఔషధ పరీక్షలు, ప్లాస్మా వంటి థెరపీ చికిత్సల పనితీరును ప్రయోగశాలలో పరీక్షించేందుకు వైరస్‌ను వృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘
మానవుల్లో పెరిగే కరోనా వైరస్ కణాలను బయట పరిశోధనశాలలో వృద్ధిచేయడం సాంకేతికంగా పెద్ద సవాలు. ఐస్టెమ్ రూపమిస్తున్న కణవ్యవస్థ ఏసీఈ2 గ్రాహకం, ఇతర వైరస్ కణాల్లో ప్రవేశించడానికి, వైరస్ ఉత్పత్తికి అవసరమైన ఇతర జన్యువులను విడుదల చేస్తుంది. ఈ వ్యవస్థను ఉపయోగించి డాక్టర్ కృష్ణన్‌హర్షన్ నేతృత్వంలోని సీసీఎంబీ బృందం ల్యాబ్‌లో వైరస్‌ను పెంచడానికి, తద్వారా ఔషధ పరీక్షలు, టీకాల అభివృద్ధికి దోహదం చేస్తుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్‌మిశ్రా తెలిపారు. డాక్టర్ రాజర్షిపాల్ బృందం అభివృద్ధి చేసిన యాంటీ కొవిడ్ స్క్రీనింగ్‌ను ఉపయోగించుకుని సీసీఎంబీ పరిశోధనల్లో ముందుకెళ్తుందని ఆశిస్తున్నామని ఐస్టెమ్ సీఈవో డాక్టర్ జగిన్ దేశాయ్ అన్నారు. బెంగళూరులోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ఫ్లాట్‌ఫాం(సీసీఎంపీ)లో కణచికిత్సపై ప్రారంభమైన అంకుర సంస్థ తమదని ఆయన తెలిపారు.
ఇదీ చూడండి:గుట్టు వీడింది: ఆరు వేళ్లకు ఆ జన్యువే కారణం