రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది. కరోనా సంక్షోభానికి ముందు ఆర్టీసీకి రోజుకి రూ.11 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కొవిడ్ రెండో దశ వేగంగా వ్యాపించడంతో.. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్డౌన్ను విధించింది. ముందుగా కేవలం రాత్రి పూట మాత్రమే కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. దాన్ని లాక్డౌన్గా మార్చేసింది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే విరామ సమయం ఉండడంతో దగ్గరి ప్రాంతాలకు మాత్రమే సర్వీసులను తిప్పింది ఆర్టీసీ. విరామ సమయాన్ని సాయంత్రం 5 గంటల వరకు పెంచడంతో ఇప్పుడు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు సర్వీసులను తిప్పుతున్నామని అధికారులు వెల్లడించారు. అంతర్రాష్ట్ర సర్వీసులు మాత్రం తిప్పడం లేదని స్పష్టం చేశారు. కరోనా కేసులు అదుపులోకి వచ్చి.. ప్రభుత్వం అనుమతిస్తేనే ఆయా సర్వీసులు అందుబాటులోకి వస్తాయంటున్నారు.
రోజుకు రూ.4 కోట్ల ఆదాయం
తెలంగాణ ఆర్టీసీకి మొత్తం 9,754 బస్సులు ఉన్నాయి. వీటిలో 6,579 ఆర్టీసీ బస్సులు, 3, 175 అద్దె బస్సులు ఉన్నాయి. లాక్డౌన్ విరామ సమయం నాలుగు గంటలు మాత్రమే ఉన్నప్పుడు జిల్లాలకు కేవలం 1, 500 బస్సులు మాత్రమే తిప్పేవారు. తద్వారా ఆర్టీసీకి సుమారు రూ. కోటి వరకు ఆదాయం సమకూరేది. ఆ తర్వాత ప్రభుత్వం లాక్డౌన్ విరామ సమయాన్ని 11 గంటల వరకు పెంచడంతో బస్సుల సంఖ్యను 5 వేలకు పెంచారు. దీంతో ఆర్టీసీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సమయంలో ఆర్టీసీకి రూ. 4కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనావేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 2, 400 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు విరామ సమయం ఉన్నప్పుడు 700 సిటీ బస్సులను తిప్పారు. ఆ సమయంలో ఆర్టీసీకి రూ. 15 నుంచి రూ. 20 లక్షల ఆదాయం వచ్చేది. విరామ సమయం.. మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచినప్పుడు 900 ఆర్టీసీ బస్సులను తిప్పారు. అయితే.. ఆదాయం మాత్రం పెద్దగా పెరగలేదు. ప్రస్తుతం విరామ సమయం సాయంత్రం 5 గంటల వరకు ఉండడంతో.. 1, 500 బస్సులను తిప్పుతున్నారు. ప్రస్తుతం ఆదాయం రూ. కోటి 15 లక్షల వరకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.