తెలంగాణ

telangana

ETV Bharat / state

రైలు సిగ్నల్ కట్​ చేస్తారు.. రాళ్లవర్షం కురిపిస్తారు.. ఆపై! - పార్థీ గ్యాంగ్​పై తాజా వార్తలు

రాత్రి వేళ కాపు కాసి రైల్వే సిగ్నల్​ వైర్లను కట్ చేస్తారు. ఒక్కసారిగా రైలు బోగీలపై  రాళ్ల వర్షం కురిపిస్తారు. బోగీ పక్కన ఒకరిపై ఒకరు నిచ్చెనలా నిలబడి నిద్రిస్తున్న మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలను చోరీ చేస్తారు. ప్రతిఘటించిన వారిని కత్తితో బెదిరిస్తారు. ఎదురిస్తే దాడికి తెగబడతారు. వీళ్లంతా ఎవరనుకుంటున్నారా... వాళ్లే పార్ధీ గ్యాంగ్​ ముఠా.

the-train-signal-will-be-cut-the-rain-will-fall-and-then
రైలు సిగ్నల్ కట్​ చేస్తారు.. రాళ్లవర్షం కురిపిస్తారు.. ఆపై!

By

Published : Dec 10, 2019, 3:40 PM IST

పార్థీ గ్యాంగ్.. ఈ మధ్య కాలంలో ఈ పేరు వినని వారు లేరనడం అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ఇళ్లల్లో, రైళ్లలో వరుస చోరీలకు పాల్పడి.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది ఈ ముఠా. రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చిన 'వేర్​ ఈజ్​ మై ట్రేన్​' యాప్​ను ప్రధాన ఆయుధంగా మలుచుకుని దోపీడీలకు పాల్పడుతున్న ఈ ముఠాలో మొత్తం 9 మంది సభ్యులు ఉన్నారు. వీరు రాత్రి వేళలో రైలు ప్రయాణిస్తున్న మార్గంలో కాపుకాసి.. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న రైల్వే సిగ్నల్ వైరును కత్తిరిస్తారు. దీంతో గ్రీన్​సిగ్నల్​కు బదులుగా రెడ్​ సిగ్నల్ పడుతుంది.

కత్తులతో బెదిరించి...
ఫలితంగా రైలు నిలిచిపోగానే నిందితులు బోగీలపై రాళ్ళ వర్షం కురిపిస్తారు. మరికొంత మంది రైలు బోగీల పక్కన ఒకరిపై ఒకరు నిలబడి.. నిద్రిస్తున్న మహిళా ప్రయాణికుల మెడలో నుంచి ఆభరణాలు దొంగిలిస్తారు. ప్రతిఘటించిన వారిని కత్తులతో బెదిరిస్తారు. ఎదురుతిరిగితే దాడికి తెగబడతారు.

ప్రయాణికులకు గాయాలు...
మహారాష్ట్రకు చెందిన ఈ ముఠా సభ్యులు గత సెప్టెంబర్​లో మహబూబ్​నగర్, దివిటిపల్లి, కౌకుంట్ల రైల్వే స్టేషన్ల వద్ద వరుసగా ఏడు దోపీడీలు చేసి పోలీసులను ఉరుకులు పెట్టించారు. యశ్వంత్​పూర్ ఎక్స్​ప్రెస్, జబల్​పూర్ ఎక్స్​ప్రెస్​లలో దోపీడీలకు పాల్పడినపుడు చేసిన రాళ్ళదాడిలో కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.


ప్రత్యేక బృందం ఏర్పాటు...

ఇలా వరుస దోపిడీలకు పాల్పడుతున్న వీరిపై రైల్వే పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. రైల్వే అదనపు డీజీ సందీప్ శాండిల్యా ఆదేశాలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి.. ఈ ముఠాకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు అవినాశ్ శ్రీరామ్​ కాలే​ తన స్నేహితుడిని కలిసేందుకు నగరానికి వచ్చాడన్న పక్కా సమాచారంతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన మరో నిందితుడిని సైతం త్వరలోనే అరెస్టు చేస్తామని సికింద్రాబాద్​ రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు.

రైలు సిగ్నల్ కట్​ చేస్తారు.. రాళ్లవర్షం కురిపిస్తారు.. ఆపై!

ఇదీ చూడండి : చెట్టును ఢీ కొట్టాడు... జరిమానా కట్టాడు..

ABOUT THE AUTHOR

...view details