తెలంగాణ

telangana

ETV Bharat / state

Secretariat works: సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం.. దసరా నాటికి పూర్తయ్యే అవకాశం

దసరా నాటికి నిర్మాణం పూర్తిచేసే దిశగా సచివాలయ పనులు కొనసాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు 60 నుంచి 70 శాతం వరకు పనులు పూర్తైనట్లు సమాచారం. డోమ్‌లు, ఫ్రంట్ ఎలివేషన్‌కు సంబంధించిన పనులతోపాటు ఇతర పనులు సమాంతరంగా సాగుతున్నాయి.

Secretariat works
సచివాలయ నిర్మాణ పనులు

By

Published : Mar 26, 2022, 4:46 AM IST

Updated : Mar 26, 2022, 5:53 AM IST

ఆధునిక హంగులతో సువిశాలంగా రాష్ట్ర పరిపాలనా భవనం సిద్ధమవుతోంది. సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటలపాటు పనులు జరుగుతున్నాయి. గత సచివాలయ ప్రాంగణం మొత్తం 25 ఎకరాల్లో ఉండగా... వాస్తు సహా అన్ని రకాలుగా పరిశీలించి 20 ఎకరాల మేర చతురస్రాకార స్థలాన్ని ఎంపిక అందులో కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టారు. రెండస్తుల మేర ఉండే గ్రౌండ్ ఫ్లోర్, ఆపై ఆరంతుస్తుల్లో సచివాలయ భవన నిర్మాణం జరుగుతోంది. మధ్యలో భారీ కోర్ట్ యార్డు ఉండేలా నిర్మాణం చేపట్టారు. మొత్తం తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఎనిమిది లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం పూర్తైంది. మొత్తం పనుల్లో 60 నుంచి 70 శాతం వరకు పూర్తయ్యాయి. కాంక్రీటు, స్లాబులకు సంబంధించిన పనులన్నింటినీ పూర్తి చేశారు.

రెండంతస్తులు మినహా అన్ని అంతస్థుల ఇటుక పని పూర్తి కాగా... సగం అంతస్థుల వరకు గోడలకు లప్పం తదితర పనులు కూడా పూర్తయ్యాయి. భవనం పైభాగాన శిఖరాలుగా వచ్చే డోంల నిర్మాణంతోపాటు ఫ్రంట్ ఎలివేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఫ్రంట్ ఎలివేషన్ కోసం అవసరమైన ధోల్ పూర్ ఇసుకరాయిని రాజస్థాన్ నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పటికే కొంత మేర సచివాలయ ప్రాంగణానికి చేరుకొంది. దాన్ని డిజైన్‌గా చెక్కే పనులు కూడా ప్రారంభమయ్యాయి. కార్పెంటర్, ప్లంబింగ్ పనులు కూడా జరుగుతున్నాయి. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని సచివాలయ నిర్మాణం జరుగుతోంది.

సచివాలయ నిర్మాణ పనులు వేగవంతం

ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం:ఆరు అంతస్తుల్లో పాలనా విభాగాలు ఉండనున్నాయి. ఆరో అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు మంత్రివర్గ సమావేశ మందిరం, పెద్ద సమావేశ మందిరం తదితరాలు ఉంటాయి. రెండో అంతస్తు నుంచి మంత్రుల కార్యాలాయాలు ఉంటాయి. ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలనా శాఖ, ఆర్థిక శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. సర్వర్లు, స్టోర్ రూంలు, తదితర అవసరాలన్నింటినీ కింది అంతస్థులోనే ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు విడిగా పార్కింగ్ ఉంటుంది. అధికారులు, సిబ్బందికి కూడా వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంటుంది. సందర్శకుల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ వసతి ఉంటుంది. ప్రార్థనా మందిరాలు, మిగతా కార్యాలయాలు అన్నీ సచివాలయం వెలుపలే ఉంటాయి. ప్రహరీ లోపల కేవలం సచివాలయ భవనం మాత్రమే ఉంటుంది.

దసరా నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ సమాంతరంగా సాగుతున్నాయి. పనుల పురోగతిని శుక్రవారం పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించారు. అయితే ధాన్యం కొనుగోళ్ల అంశంపై మంత్రులతో సమావేశం సుధీర్ఘంగా సాగడంతో సచివాలయ సందర్శన జరగలేదు. త్వరలోనే సీఎం కేసీఆర్ సచివాలయాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తారని చెబుతున్నారు.

ఇదీ చూడండి:

Telangana Loan: మరో వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు

Last Updated : Mar 26, 2022, 5:53 AM IST

ABOUT THE AUTHOR

...view details